Srikakulam Crime: ఆ తండ్రి విచక్షణ కోల్పోయాడు. బిడ్డలపై నాన్నగా మమకారం చూపడం బదులు, ప్రతిరోజూ వారిని కొట్టేవాడు. తన కళ్లెదుట బిడ్డలను తండ్రి కొడుతున్నా, ఆ తల్లి మాత్రం అలాగే రోదిస్తూ ఉండేది. ఒక్కసారిగా ఆమెలో ఆగ్రహం పెల్లుబికింది. ఉగ్రరూపం దాల్చి బిడ్డలను వేధిస్తున్న తన భర్తనే హత్య చేసింది. బిడ్డల బాధ చూడలేక ఆ తల్లి హత్యకు పాల్పడింది. చివరికి కటకటాల పాలైంది. ఈ దారుణ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
బిడ్డలకు అమ్మ అనురాగం, నాన్న ఆప్యాయత అవసరం. వీటిలో ఏది కొరతైనా ఆ పసిమనసులు గాయపడాల్సిందే. నాన్న అంటేనే ఓ భరోసా, నమ్మకం. నేటి సమాజంలో బిడ్డలపై మమకారం చూపే నాన్నలు ఉన్నారు. అదే బిడ్డలపై కర్కశత్వంతో దాడికి పాల్పడే నాన్నలు కూడా ఉన్నారు. ఈ ఘటన అలాంటిదే అయినప్పటికీ, ఇక్కడ తల్లి మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 ఏళ్లుగా తన భర్తను భరించింది. రోజూ బిడ్డలను తండ్రి ఇష్టారీతిన కొడుతున్నా భరిస్తూ.. అదే కారణంగా భర్తను భార్య హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
శ్రీకాకుళంలో మజ్జి తులసి, మజ్జి రమేష్ అనే భార్య, భర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. రమేష్ కు మద్యం అలవాటైంది. రోజూ మద్యం సేవించి రావడం, భార్యా పిల్లలను కొట్టడం అతని డ్యూటీగా మార్చుకున్నాడు. ఇలా రోజూ జరిగే దినచర్య. తన బిడ్డలను కళ్లముందు కొడుతుంటే తులసి రోదించేది. ఎక్కడైనా బిడ్డల జోలికి వెళితే మొదటగా యాక్షన్ లోకి తల్లి వస్తుంది. పక్షులు, జంతువులలో కూడా అమ్మ ప్రేమ ఇలాగే ఉంటుంది. అయితే తులసి కూడా 17 ఏళ్లు భర్త వేధింపులను భరించింది. బిడ్డలను ఇబ్బందులకు గురి చేస్తున్నా, అలాగే ఓపికతో కాలం వెళ్లదీసేది.
ఈ నెల 25న రమేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో పోలీసులకు హత్య చేసినట్లుగా నిర్ధారణ అయింది. ఆ తర్వాత తులసిని పోలీసులు విచారించారు. అప్పుడు అసలు విషయం తెలిసింది. తన భర్త మద్యానికి బానిసై డబ్బులు ఇవ్వని పక్షంలో తనని కొట్టేవాడని తులసి తెలిపింది. అంతేకాదు 17 ఏళ్లుగా రోజూ తన ఇద్దరు బిడ్డలను కొడుతూ హింసించేవాడని, అందుకే హత్యకు పాల్పడినట్లు తులసి అంగీకరించిందని పోలీసులు వెల్లడించారు.
Also Read: తల్లికి వందనం స్కీమ్.. అర్హతలు ఇవేనా?
మద్యానికి బానిసై భర్త వేధింపులు భరించలేక చున్నీతో పీక నులిమి హత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తులసి అసలు విషయాన్ని చెప్పింది. దీనితో తులసిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన పిల్లలను భర్త కొట్టడం చూడలేక. హత్యకు తులసి పాల్పడిందని క్రైమ్ డిఎస్పీ వివేకానంద తెలిపారు. అయితే అటు నాన్న మృత్యు ఒడిలోకి వెళ్లగా, అమ్మ కటకటాల పాలైంది. దీనితో ఆ ఇద్దరు పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉండగా, కుటుంబసభ్యులు చేరదీసినట్లు సమాచారం. పిల్లల కోసం భర్తను భార్య హత్య చేసిందన్న విషయం శ్రీకాకుళం జిల్లాలో సంచలనంగా మారింది. మొత్తం మీద పోలీసులు దర్యాప్తు చేసి, ఎట్టకేలకు కేసును ఛేదించారు.