CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్ కి బీఆర్ఎస్, బీజేపీ ఎలా స్పందిస్తాయో కానీ, సీఎం చేసిన సవాల్ ఇప్పుడు సంచలనంగా మారింది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన, కేంద్రంలో 12 ఏళ్ల బీజేపీ పాలన, తమ కాంగ్రెస్ ప్రభుత్వ 12 నెలల పాలనపై చర్చకు సిద్దమా అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నారాయణపేట్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం, బహిరంగ సభలో మాట్లాడారు. శుక్రవారం సీఎం పర్యటన పలు అభివృద్ది కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలతో బిజిబిజీగా సాగింది.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అరుణమ్మ
నారాయణపేట్ జిల్లా పర్యటన నిమిత్తం వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ నాయకురాలు, ఎంపీ డికె ఆరుణ కలిశారు. ఈ సంధర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని పలు సమస్యలను సీఎం దృష్టికి అరుణ తీసుకువచ్చారు. అభివృద్ది కార్యక్రమాల జాబితాతో కూడిన వినతిపత్రాన్ని అరుణ అందజేశారు. ఈ వినతిపత్రాన్ని అందుకున్న సీఎం సానుకూలంగా స్పందించారు. కాగా సీఎం రేవంత్ రెడ్డికి అరుణకు మధ్య గతంలో మాటల యుద్దం సాగిన విషయం తెల్సిందే. గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి లక్ష్యంగా అరుణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. కానీ రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయినప్పటికీ, తాజాగా ఎంపీ హోదాలో ఉన్న అరుణ శుక్రవారం సీఎంను కలవగా ఇరు పార్టీల కార్యకర్తలు ఆసక్తికరంగా ఆ దృశ్యాన్ని చూశారు. డికె అరుణ అలా వినతిపత్రం ఇవ్వగానే, సీఎం గౌరవంగా స్వీకరించి సానుకూలంగా స్పందించడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
చర్చకు సిద్దమా?
అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అనంతరం నారాయణపేట్ గురుకుల హాస్టల్ ఆవరణలో ప్రజా పాలన- ప్రగతి బాట బహిరంగ సభలో ప్రసంగించారు. సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక కూడా పాలమూరుకు అన్యాయం జరిగిందన్నారు. గత ఐదేళ్లు పాలమూరు ప్రాజెక్టులు కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్‌కు ఎంపీ పదవి పాలమూరు ప్రజల భిక్షే.. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ దోచుకున్నారని విమర్శించారు. పాలమూరు పేదరికాన్ని చూపించి మార్కెటింగ్ చేసుకున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
Also Read: KCR – Assembly : కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేలా ఆర్డర్ ఇవ్వండి – హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్
లగచర్లలో గొడవ పెట్టాలని చూశారు, కలెక్టర్‌ను చంపాలని చూశారన్నారు. మా ప్రాంతంలో పరిశ్రమలు రావొద్దా? మా పిల్లలకు ఉద్యోగాలు రావొద్దా? పాలమూరులో పరిశ్రమలను ఎందుకు అడ్డుకుంటున్నారని సీఎం ప్రశ్నించారు. ప్రధాని మోడీ, కేసీఆర్ పరిపాలన మీద చర్చ పెడదామని, గత పదేళ్ల కేసీఆర్ పాలన, 12 ఏళ్ల మోడీ పాలన, 12 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్దమా అంటూ సీఎం సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఫ్రీ బస్సు, గృహ జ్యోతి, రుణమాఫీ, రైతు బంధు, ఇందిరమ్మ గృహాలు, జాబ్ నోటిఫికేషన్స్ ఇలా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజలకు జరిగే మంచిని ఓర్వలేక అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, ఇప్పటికైనా మారాలని సీఎం హితవు పలికారు.