KCR – Assembly : తెలంగాణలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి, ఓడిపోయినప్పటి నుంచి ప్రజలకు కనిపించకుండా పోయిన కేసీఆర్.. కనీసం అసెంబ్లీకి కూడా రాకపోవడంపై అనేక విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను అసెంబ్లీకి వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రతీ ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ప్రజల సమస్యల్ని, వారి ప్రాంత బాగోగుల్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని, అలాంటి పని చేయనప్పుడు వారికి పదవులు ఎందుకని పిటిషనర్ ప్రశ్నించారు. కేసీఆర్ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారని, అది మరింత బాధ్యతలతో కూడుకున్నదని, అలాంటి బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తిచకుండా ఉండడం సరైన చర్య కాదంటూ.. తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడుక డి.విజయ్ పాల్ రెడ్డి పిటిషన్ దాఖాలు చేశారు. ప్రస్తుతం ఈ పటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.
స్పీకర్ కార్యాలయం చర్యలు తీసుకోవాలి..
ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీకి రాకుండా కాలక్షేపం చేస్తున్న కేసీఆర్ పై రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, స్పీకర్ కార్యాలయం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన విజయ్ పాల్.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలిపారు. 2023 డిసెంబరు 16న ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆయన రాష్ట్ర అసెంబ్లీకి రాలేదు. అయినా ఇంతవరకు ప్రజాప్రతినిధుల విధులు, బాధ్యతల విషయంలో పాటు వారి సభ్యత్వాన్ని నిర్థరించే శక్తివంతమైన అధికారులున్న స్పీకర్ కానీ, స్పీకర్ కార్యాలయం కానీ తగిన ప్రొసీడింగ్స్ చేపట్టలేదన్నారు. నెలకు రూ.లక్షల్లో వేతనాలు, అలెవెన్సులు తీసుకుంటూ కూడా ప్రజా సమస్యలపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తే ఎలాగని ప్రశ్నించారు.
కేసీఆర్ ను మార్చి వేరే వాళ్లను ఎన్నుకో కేటీఆర్
ప్రతిపక్ష నేతగా కేసీఆర్ విధులు నిర్వహించలేకపోతే ఆ బాధ్యతల నుంచి తప్పించి.. వారి స్థానంలో కొత్తవారిని ఎంచుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం.. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహకాధ్యక్షుడిగా ఉన్న కేటీఆర్.. అసెంబ్లీలో తమ పార్టీ శాసనసభా పక్ష నేతగా మరొకరిని ఎన్నుకునేలా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఇదే విషయమైన స్పీకర్ కు, స్పీకర్ కార్యాలయానికి కోర్టు నోటీసులు పంపించామని.. అయినా ఎలాంటి స్పందనా లేకపోవడంతోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని పిటిషనర్ వివరించారు. న్యాయవ్యవస్థ ముందుకు తొలిసారి ఇలాంటి పిటిషన్ వచ్చిందని తెలిపిన పిటిషనర్.. శాసన వ్యవస్థ, అధికారులు తీసుకునే నిర్ణయాలను పూర్తిగా సమీక్షించే విస్తృతాధికారం కోర్టులకు ఉందని స్పష్టం చేశారు.
సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ పెండింగ్
మరోవైపు.. తమ పార్టీలో గెలిచి, వేరే పార్టీలోకి వెళ్లారంటూ తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ సుప్రీం కోర్టు విచారణలో ఉంది. వారి అర్హత, అనర్హతలు నిర్థరించే అధికారం ఉన్న స్పీకర్ కార్యాలయానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలంటూ కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే.. ఈ పిటిషన్ ను అనేక సార్లు విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలేదు. కాగా.. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్‌లు స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేశారు. వీరు కాకుండా.. మరో ఏడుగురు ఎమ్మెల్యేలు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీలపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై ఎలాంటి నిర్ణయం వెలువరించని నేపథ్యంలో.. కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని, లేదా ప్రతిపక్ష నాయకుడిని మార్చాలంటూ పిల్ దాఖలు కావడం ఆసక్తికరంగా మారింది.
Also Read : Kishan Reddy: హీటెక్కిన ఎమ్మెల్సీ ఎన్నికలు.. కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సూటి ప్రశ్న