Cm Revanth Reddy
తెలంగాణ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్టు షాపులను క్టోజ్ చేసేందుకు సీఎం రేవంత్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్.. కీలక నిర్ణయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే కరెంట్, ఇరిగేషన్ శాఖలతో పాటు ఉద్యోగాల భర్తీ, టీఎస్పీఎస్సీ బోర్డుపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. నిత్యం రివ్యూలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.
ఈ క్రమంలోనే.. మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులపై దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా.. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు బెల్టు షాపులను మూసి వేసే దిశగా అడుగులు వేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,620 వైన్ షాపులు ఉన్నాయి. దీంతో పాటు గ్రామాల్లో అనధికారికంగా బెల్టు షాపులు ఉన్నాయి. ప్రస్తుతం మద్యం దుకాణాలు రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుండగా.. ఈ సమయాన్ని కుదించేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని బెల్ట్ షాపులను కూడా పూర్తిగా బంద్ చేయించేందుకు కసరత్తు చేస్తోంది సీఎం రేవంత్ సర్కార్ .
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించినట్టు సమాచారం. దీంతో.. ఇచ్చిన మాట ప్రకారం బెల్ట్ షాపులను మూయించే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అయితే.. మద్యం దుకాణాల్లో పరిమిత సమయం లిక్కర్ అమ్ముతుండగా.. బెల్ట్ షాపుల్లో మాత్రం 24 గంటల పాటు లిక్కర్‌ను అమ్ముతుండటం గమనార్హం. ఈ బెల్ట్ షాపుల వల్ల గ్రామాల్లోని యువత మద్యానికి బానిసలవుతున్నారని భావిస్తోన్న రేవంత్ సర్కార్.. వాటిని నిర్మూలించే దిశగా కసరత్తు చేస్తోంది. అయితే.. బెల్త్ షాపులు క్లోజ్ చేయకుంటే కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకునేలా ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం.