CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఈడీ వీధి దీపాల వ్యవస్థను.. సమగ్రంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుండి కోర్ అర్బన్ సిటీ వరకు అన్ని ఎల్ఈడీ లైట్ల వ్యవస్థను.. సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలతో సమీక్ష నిర్వహించి.. స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
గ్రామాల్లో సర్పంచులకే బాధ్యతలు
గ్రామ పంచాయతీల పరిధిలో వీధి దీపాల నిర్వహణ.. పూర్తిగా సర్పంచుల చేతుల్లోనే ఉండాలని సీఎం ఆదేశించారు. గ్రామాల్లో ఇప్పటికే అమర్చిన లైట్లు సరిగా వెలుగుతున్నాయా లేదా, కొత్త లైట్లు ఎన్ని అవసరమవుతున్నాయో.. ఖచ్చితమైన అంచనాకు ప్రతి పోల్ సర్వే తప్పనిసరిగా చేయాలని సూచించారు. రాత్రిపూట మాత్రమే లైట్లు పనిచేయాలి, పగటిపూట అవి వెలగకుండా కచ్చితమైన పర్యవేక్షణ ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
మానిటరింగ్ వ్యవస్థ బలోపేతం
మండల స్థాయిలో ఎల్ఈడీ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసి, ఎంపీడీవో పర్యవేక్షణలో ఉండాలని ఆదేశించారు. జిల్లాల వారీగా అడిషనల్ కలెక్టర్లకూ బాధ్యతలు అప్పగించాలని సీఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 16.16 లక్షల ఎల్ఈడీ లైట్లు ఉన్నాయని అధికారులు వివరించగా, కొన్నిచోట్ల కాంట్రాక్టు ఏజెన్సీల ఆధీనంలో ఉన్న లైట్లు సరైన రీతిలో పనిచేయకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం
హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు.. అన్ని ఎల్ఈడీ లైట్లు అనుసంధానం కావాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 5.50 లక్షల లైట్లు ఉన్నాయని, అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ సిటీని కలుపుకుంటే మొత్తం 7.50 లక్షల లైట్లు అవసరం అవుతాయని మున్సిపల్ శాఖ సీఎంకు నివేదించింది. గతంలో ఉన్న కాంట్రాక్టు గడువు ముగియడంతో.. లైట్ల నిర్వహణ లోపాలు తలెత్తాయని అధికారులు వెల్లడించారు.
కొత్త టెండర్ల ఆహ్వానం
కొత్తగా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, నిర్వహణ కోసం టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. లైట్ల తయారీలో అనుభవం కలిగిన కంపెనీలను ఆహ్వానించి, ఏడు సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యతలు అప్పగించే విధంగా టెండర్ షరతులు రూపొందించాలన్నారు. లైట్లతో పాటు కంట్రోల్ బాక్స్‌లను కూడా ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేస్తున్నాయా లేదా అనే విషయాన్ని మానిటరింగ్ చేయడానికి ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సూచించారు.
థర్డ్ పార్టీ ఆడిట్, సోలార్ పవర్ పరిశీలన
వ్యవస్థలో పారదర్శకత కోసం హైదరాబాద్ ఐఐటీ లాంటి సంస్థల ద్వారా థర్డ్ పార్టీ ఆడిట్ చేయాలని సీఎం సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే ప్రతి నెలా.. రూ.8 కోట్ల కరెంటు బిల్లు చెల్లించాల్సి వస్తోందని అధికారులు వెల్లడించగా, విద్యుత్తు ఆదా కోసం సోలార్ పవర్ వినియోగం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.
కొత్త మున్సిపాలిటీలలో కూడా లైట్లు
రాష్ట్రంలో ఇటీవల ఏర్పడ్డ మున్సిపాలిటీలు, విలీనమైన గ్రామాలు, కొత్తగా ఏర్పడిన నగర ప్రాంతాల్లో కూడా లైట్ల అవసరాన్ని అంచనా వేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కోర్ అర్బన్ సిటీ పరిధితో పాటు.. మున్సిపాలిటీలకు కూడా ప్రత్యేక టెండర్లు పిలవాలని ఆయన పేర్కొన్నారు.
Also Read: శ్రీవారి ఆలయంలో రేపు వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు
ఈ చర్యలన్నింటి ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో వీధి దీపాలు సక్రమంగా వెలగాలని, విద్యుత్తు వృథా కాకుండా నిరోధించాలని, అలాగే పారదర్శకతతో కూడిన నిర్వహణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల భద్రత, సౌకర్యం, శక్తి ఆదా ప్రధాన లక్ష్యాలుగా ఈ చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.