CM Revanth Reddy: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ బిల్లులు ఆమోదం పొందే వరకు తాము నిద్రపోమని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోరుతూ ఢిల్లీ జంతర్‌మంతర్‌లో బుధవారం నిర్వహించిన పోరుబాట ధర్నాలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
బలహీన వర్గాలపై కక్ష గట్టిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ 50 శాతం రిజర్వేషన్లు మించకుండా చట్టం చేశారని విమర్శించారు. నాడు కేసీఆర్ చేసిన చట్టం నేడు రిజర్వేషన్లకు గుదిబండగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బలహీన వర్గాల బిడ్డలు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు కాకుండా అడ్డుగా ఉన్న చట్టాన్ని తొలగించాలని తామ ఆర్డినెన్స్ చేసి గవర్నర్‌కు పంపామని… దానిని ఆమోదించడం లేదని సీఎం తెలిపారు. వెనుకబడిన వర్గాలకు స్థానిక ఎన్నికల్లో… విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఢిల్లీలో ధర్నాకు దిగామని, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సాధించి తీరుతామని సీఎం తెలిపారు.
42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకు తెలంగాణలోనైనా ధర్నా చేయొచ్చని… కానీ అక్కడ ధర్నా చేస్తే స్థానిక పార్టీలు మాత్రమే వస్తాయని.. అందుకే ఢిల్లీలో ధర్నా చేస్తున్నామని సీఎం తెలిపారు. ఢిల్లీలో ధర్నా చేయడంతోనే కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎంపీలతో పాటు ఇండియా కూటమిలోని సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఎన్సీపీ, వామపక్షాలకు చెందిన వంద మంది ఎంపీలు ధర్నాలో పాల్గొని మనకు సంఘీభావం తెలియజేశారని సీఎం తెలిపారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు మీకు అండగా ఉంటామని ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మనకు మద్దతు ఇచ్చారన్నారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత హామీ ఇచ్చారని… ఆ హామీ మేరకు ఏడాదికాలంలోనే కుల గణన చేపట్టి… బీసీ రిజర్వేషన్ల బిల్లులను శాసనసభలో ఆమోదించామని సీఎం తెలిపారు. దేశంలో వందేళ్ల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేయలేదని… ఇప్పటి వరకు దేశంలో 300 మంది ముఖ్యమంత్రులైనా ఎవరూ చేయని పనిని చేసే అదృష్టం తనకు దక్కిందని ముఖ్యమంత్రి అన్నారు. బీసీల రిజర్వేషన్లు పెంచే అవకాశం తనకు వచ్చిందని తెలిపారు.
తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపును ఆమోదించకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దె దించుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గోద్రా అల్లర్ల సమయంలో రాజీనామా చేయమని నాటి ప్రధానమంత్రి వాజ్‌పేయీ నరేంద్ర మోదీని కోరితే చేయలేదని… ఇప్పుడు 75 ఏళ్లు నిండినందున పదవి నుంచి వైదొలగాలని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ కోరుతున్నా నరేంద్ర మోదీ పట్టించుకోవడం లేదన్నారు. నరేంద్ర మోదీ లేకపోతే 150 సీట్లు కూడా బీజేపీకి రావని మోదీ భక్తుడు నిశికాంత్ దూబే అంటున్నారని… ఈసారి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ 150 సీట్లు దాటవని సీఎం అన్నారు. బీసీ రిజర్వేషన్లను మోదీ అడ్డుకుంటే ఆయనను గద్దె దించి ఎర్ర కోట మూడు రంగుల జెండా ఎగురవేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకొని తమ డిమాండ్‌ను నెరవేర్చుకుంటామన్నారు.
Also Read: Konda Surekha: బీజేపీపై బిగ్ బాంబ్ విసిరిన కొండా సురేఖ.. రాష్ట్రపతినే అవమానించారంటూ కామెంట్స్!
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాంచందర్‌రావులు బీసీ రిజర్వేషన్ల పెంపునకు అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు తెలంగాణ బీసీల అవసరం లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు బీసీ రిజర్వేషన్ల పెంపు ధర్నాకు ఎందుకు రాలేదని, ఆ పార్టీ తెలంగాణతో పేరు బంధంతో పాటు పేగు బంధం కూడా తెంచుకుందా అని సీఎం ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు ధర్నాను కేటీఆర్ డ్రామా అంటున్నారని… కేటీఆర్ పేరే డ్రామారావని… కేసీఆర్ కుటుంబం డ్రామాలతో బతుకుతోందని సీఎం విమర్శించారు. అధికారం, పదవులు పోయినా కేటీఆర్ బుద్ధి మారలేదని.. అహంకారం తగ్గలేదని అన్నారు. ఆ కుటుంబంలోనే ఒకరు రిజర్వేషన్లకు అనుకూలమని…. మరొకరు ప్రతికూలమని… మరొకరు అటూ ఇటూ కాకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తెలంగాణ ప్రజల శక్తిని మోదీ తక్కువగా అంచనా వేస్తే ఆయనకు తడాఖా చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్ల పెంపు బిల్లులను ఆమోదించకుంటే ఇక ఢిల్లీ రామని… గల్లీకి వచ్చినప్పుడు బీజేపీ నేతలను పట్టుకుంటామని హెచ్చరించారు. దళితులు, గిరిజనులకు అండగా నిలిచి ఇందిరా గాంధీ దేశ ప్రజల గుండెల్లో ఇందిరమ్మగా నిలిచిపోయరని సీఎం కొనియాడారు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఐటీ విప్లవంతో అగ్ర కులాల్లో చాలా మంది విదేశాల్లో ఉన్నత స్థాయిల్లో స్థిరపడ్డారని సీఎం తెలిపారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వారసునిగా వచ్చిన రాహుల్ గాంధీ బీసీలకు న్యాయం చేసేందుకు కంకణం కట్టుకున్నారని, ఆయన మహత్తర ఆశయాలకు అడ్డుతగిలితే వారి చిరునామా గల్లంతవుతుందని సీఎం హెచ్చరించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చిత్తశుద్ది ఉంటే రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లులు తక్షణమే ఆమోదం పొందేలా చూడాలని.. లేకుంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు బీజేపీకి, మోదీకి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ధర్నాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, బీసీ సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.