CM Revanth Reddy: ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీల సంక్షేమానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలను సీఎం ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా ఆదివాసీల డిమాండ్లు పరిష్కారం కాకపోవడంతో, వాటిని వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. సీఎంతో ముఖాముఖిపై ఆదివాసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీఎంతో వారు మాట్లాడుతూ.. ఆదివాసీల విద్య, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్డు రవాణా వ్యవస్థతో పాటు, సాగు త్రాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలాన్నారు. అంతేకాకుండా ఐటీడీఏ లను బలోపేతం చేయాలని సూచించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో మొదటి సభ ఇంద్రవెల్లిలోనే నిర్వహించినట్లు సీఎం గుర్తు చేశారు. ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతి వనంగా మార్చాలని, అమరుల కుటుంబాలకు గృహాలు మంజూరు చేయాలని నాడే చర్చించినట్లు సీఎం తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పూర్తి చేయడం జరిగిందని, రాజకీయంగాను ఆదివాసీలకు న్యాయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.
ఆదివాసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని, కొమురం భీమ్ వర్ధంతి, జయంతులను అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేయాలని, వారి మాతృభాషలో విద్యను అందించే అంశాన్ని అధ్యయనం చేయాలన్నారు. విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు సంబంధించి పెండింగ్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ లను వెంటనే క్లియర్ చేయాలన్నారు. మంజూరైన బీఈడీ కళాశాలలకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆదివాసీ గూడాల్లో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివాసి రాయి సెంటర్లకు భవనాలు నిర్మించేందుకు అధ్యయనం చేసి తగిన రిపోర్టు తనకు అందించాలని సీఎం సూచించారు. అంతేకాకుండా కేశ్లాపూర్ జాతరకు నిధుల మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గోండు భాషలో ప్రాథమిక విద్యను అందించే అంశంపై అధ్యయనం చేయాలని, ఐటీడీఏ ప్రాంతాలకు ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ గృహాలను కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: Sankranti Festival Trains: సంక్రాంతికి ఊరికి వెళ్తున్నారా.. రైల్వే చెప్పిన శుభవార్త మీకోసమే
ఇందిర జల ప్రభ ద్వారా ఆదివాసీలకు ఉచితంగా బోర్లు వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఆదివాసీల రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్ పంప్ సెట్లు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తుందని సీఎం తెలిపారు. సీఎం వరాలజల్లు కురిపించడంపై ఆదివాసీల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సమావేశంలో మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు.
ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ప్రజా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
సమావేశానికి హాజరైన మంత్రి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదివాసీ సంఘాల నేతలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి pic.twitter.com/vSbdCYH3hs
— BIG TV Breaking News (@bigtvtelugu) January 10, 2025