Sankranti Festival Trains: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అసలే సంక్రాంతి.. ఏ రైలు చూసినా ప్రయాణికులతో నిండి ఉంటుంది. అటువంటి సమయంలో దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ ప్రకటన రైల్వే ప్రయాణికులకు భారీ ఊరటను ఇస్తుందని చెప్పవచ్చు. ఇటీవల ప్రారంభమైన చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ఏకంగా జన సాధారణ్ అన్ రిజర్వ్డ్ ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు తీసుకుంది.
అసలే సంక్రాంతి పండుగ వచ్చేసింది. రవాణా వ్యవస్థ ఈ సమయంలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ఎక్కడో సుదూరాన ఉన్నా ప్రజలంతా సంక్రాంతికి గ్రామాల బాట పట్టడం పరిపాటి. అందుకే ఇండియన్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే వాటికి సంబంధించిన ప్రకటనలను సైతం ఇండియన్ రైల్వే విడుదల చేసింది. అలాగే దక్షిణ మధ్య రైల్వే సైతం ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ప్రకటించింది. తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని జన సాధారణ్ అన్ రిజర్వ్డ్ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు దక్షిణాన మధ్య రైల్వే ప్రకటించడం శుభ పరిణామం. ఈ రైళ్లు చర్లపల్లి నుండి విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఆరు ప్రత్యేక రైళ్లను నేటి నుండి అందుబాటులోకి తీసుకురాగా, వాటిని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
అలాగే 08533 నెంబర్ గల రైలు విశాఖపట్నం నుండి చర్లపల్లి మధ్య ఈనెల 10, 12, 15, 17 తేదీలలో నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. విశాఖపట్నం నుండి 9:45 నిమిషాలకు బయలుదేరుతుందని, అదే రోజు రాత్రి 10:30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుందని వారు తెలిపారు. అలాగే 08538 నెంబర్ గల రైలు చర్లపల్లి నుండి విశాఖపట్నం కు 11, 12, 16, 17 తేదీలలో, 08537 నెంబర్ గల రైలు విశాఖపట్నం నుండి చర్లపల్లి కి 10, 11, 15, 16 తేదీలలో ప్రయాణిస్తుందని తెలిపారు.
ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, శ్యామలకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో నిలుస్తుందన్నారు. సంక్రాంతికి రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తూర్పు కోస్తా రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైలు నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్ల ఏర్పాటుతో రిజర్వేషన్ చేయించుకోని ప్రయాణికులకు భారీ ఊరట లభిస్తుందని చెప్పవచ్చు.