Revanth Reddy: రాష్ట్రంలో విద్య, వైద్యానికి సంబంధించిన క్షేత్రస్థాయి పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. శనివారం సీఎంవో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆసుపత్రుల నిర్మాణం,పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్, ఉస్మానియా ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
వైద్యుల నియామకాలు పూర్తి కావాలి..
ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది అవసరాలను గుర్తించి నియామక ప్రక్రియను మొదలు పెట్టాలని, ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యే నాటికి సిబ్బంది కొరత లేకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. ఆసుపత్రుల్లో అవసరమైన అత్యాధునిక పరికారాలను కొనుగోలు చేసి, ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యేనాటికి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
క్షేత్రస్థాయికి కలెక్టర్లు వెళ్లాల్సిందే..
జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో పాటు అధికారులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, ఆసుపత్రులను సందర్శించాల్సిందేనని స్పష్టం చేశారు. సంబంధిత జిల్లాకు సంబంధించి జిల్లా స్థాయిలో ప్రతీ వారం వీటిపై సమీక్ష నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాఠశాలల్లో అవసరమైన చోట మరమ్మతు పనులను చేపట్టాలని తెలిపారు.
అధికారులకు సీఎం సూచనలు..
డిసెంబరులో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లపైనా సమావేశంలో అధికారులతో చర్చించారు. సమ్మిట్ ఏర్పాట్లు, అతిథులు, పెట్టుబడుల విషయంలో పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. త్వరలోనే ఏర్పాట్లను పరిశీలిస్తానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, సీఎంవో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం.. మంత్రి నారాయణ కీలక ప్రకటన