TOSS Results: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ఆధ్వర్యంలో గత అక్టోబర్‌లో నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అక్టోబర్ 11 నుంచి 17 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ మంగళవారం ప్రకటించారు. అభ్యర్థులు బుధవారం ఉదయం 11 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్ www.telanganaopenschool.org ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చని, డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. పదో తరగతిలో మొత్తం 8,095 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 3,775 మంది(46.63%) ఉత్తీర్ణులయ్యారు.
ఇందులో బాలురు 4,842 మందికి గాను 2,065 మంది(42.65%), బాలికలు 3,253 మందికి గాను 1,710 మంది(52.57%) ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ లో మొత్తం 10,669 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, 6,482 మంది(60.76%) పాసయ్యారు. ఇందులో బాలురు 6,472 మందికి గాను 3,663 మంది(56.60%), బాలికలు 4,197 మందికి గాను 2,819 మంది(67.17%) ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు తమ వెబ్ మార్కుల మెమోలను ఈనెల 21 నుంచి వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని స్పష్టంచేశారు. మెమోలలో ఏవైనా తప్పులుంటే నవంబర్ 30 లోపు సంబంధిత డీఈవో, హెచ్‌ఎం లేదా ఏఐ కోఆర్డినేటర్ ద్వారా హైదరాబాద్‌లోని టాస్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆ తర్వాత వచ్చే అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టంచేశారు. జవాబు పత్రాల రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్ కోసం ఈనెల 21 నుంచి 28 వరకు ఫీజు చెల్లించవచ్చని వెల్లడించారు. రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు ఇంటర్ అభ్యర్థులు రూ.400, టెన్త్ అభ్యర్థులు రూ.350 చెల్లించాలని వెల్లడించారు. రీ-వెరిఫికేషన్ కమ్ ఫోటోకాపీ కోసం టెన్త్, ఇంటర్ అభ్యర్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,200 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఈ ఫీజును వెబ్‌సైట్ లేదా మీ-సేవ కేంద్రాల ద్వారా చెల్లించవచ్చని డైరెక్టర్ స్పష్టం చేశారు.
Also read: ముద్రా రుణాల పేరుతో భారీ సైబర్ మోసం