Family Comedy Drama: 24 ఏళ్ల చిన్న వయసులోనే ఓ యువకుడి మీద ఇంటి బాధ్యత మొత్తం పడితే పరిస్థితి ఎలా ఉంటుంది ? పైగా అతడికి తోడుగా ఉండాల్సిన నలుగురు తమ్ముళ్లు, చెల్లెళ్లతో ఇల్లు ఎప్పుడూ రచ్చ రచ్చగా ఉంటే ? తల్లిదండ్రులను ఊహించని విధంగా కోల్పోయిన ఐదుగురు తోబుట్టువుల జీవితాల్లోకి ఒక్కసారిగా పెద్ద మార్పు వస్తుంది. వాళ్లలో పెద్దవాడైన పవన్ కి కుటుంబానికి పెద్దగా మారాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే కథతో ‘క్యుంకీ పాపా కెహ్తే హై’ (Kyunki Papa Kehte Hain) పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్ కథ మొదలవుతుంది. మరి ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం.
సిరీస్ లో మన హీరో పవన్ వయసు కేవలం 24 ఏళ్లు. తన జీవితాన్ని గురించి ఆలోచించాల్సిన సమయంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో నలుగురు చిన్న తోబుట్టువులకు సంరక్షకుడిగా మారాల్సి వస్తుంది. వాళ్లను చూసుకోవడం, ఇంటి ఖర్చులు, చదువులు, రొటీన్ సమస్యలు అన్నీ పవన్ మీదే పడతాయి. తల్లిదండ్రులు లేకపోవడంతో పిల్లలందరూ ఒకరిపై ఒకరు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి. ఇదే సమయంలో కఠినమైన సంప్రదాయాలను పాటించే బంధువుల జోక్యం పెరుగుతుంది. పిల్లలు తమకు నచ్చినట్టుగా జీవించాలని అనుకుంటే.. పెద్దలు మాత్రం కుటుంబం కోసం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలంటారు. దీంతో పవన్‌కి ఇంటి బాధ్యతలు మరింత కష్టంగా మారతాయి. ఒకవైపు తమ్ముళ్లు, చెల్లెళ్ల చిన్న చిన్న సమస్యలు… మరోవైపు డబ్బు కోసం చేయాల్సిన ప్రయత్నాలు… ఇంకోవైపు బంధువులతో ఎదురయ్యే ఇబ్బందులు పవన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అయినా కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టకూడదని అతడు నిర్ణయించుకుంటాడు. పిల్లలు కూడా కష్టాల్లో ఒకరికొకరు అండగా నిలుస్తారు.
ఇంటి కోసం పవన్ కొత్త ఆలోచనలు చేయడం, బంధువుల ఒత్తిడిని ఎదుర్కోవడం, పిల్లల చదువులు, వాళ్ల వ్యక్తిగత సమస్యలు ఇలా ఒక్కో పరిణామం కుటుంబంలో కొత్త గందరగోళానికి దారి తీస్తుంది. క్రికెట్ ఆడుకునే తమ మైదానాన్ని బంధువులు మార్చేయాలని ప్రయత్నించడంతో పిల్లలు దాన్ని కాపాడుకునేందుకు ఏకంగా పిచ్ పైనే పడుకునే పరిస్థితి వస్తుంది. మరోవైపు పవన్ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కొత్త వ్యాపారం గురించి కూడా ఆలోచిస్తాడు. మరి తల్లిదండ్రుల స్థానాన్ని భర్తీ చేయడం పవన్ కి ఎంత కష్టంగా మారింది ? నలుగురు పిల్లలను ఒక్కతాటిపై ఎలా ఉంచాడు ? బంధువుల నియమాలకు, పిల్లల స్వేచ్ఛకు మధ్య పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు ? ఈ కుటుంబం ఎదుర్కొనే గందరగోళం చివరకు ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామాలో చూడాలి.
ఇది 2026లో వచ్చిన హిందీ ఫ్యామిలీ కామెడీ సిరీస్. రాజ్ అనద్కట్, దివ్య శర్మ, లావిష్ చౌహాన్ తదితరులు నటించిన ఈ సిరీస్‌కు ధర్మేష్ మెహతా దర్శకత్వం వహించారు. ‘క్యుంకీ పాపా కెహ్తే హై’ ప్రస్తుతం సోనీలివ్ (SonyLIV)లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం హిందీలోనే అందుబాటులో ఉంది ఈ హిందీ సిరీస్.
Read Also: 13 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమా ? కడుపుబ్బా నవ్వించే మలయాళ కామెడీ డ్రామా