CM Revanth on KCR: కేసిఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని, బీఆర్ఎస్ పార్టీ చేసే కుట్రలు, కుతంత్రాలు తనకు అన్నీ తెలుసంటూ.. అసెంబ్లీకి కేసీఆర్ వచ్చే తేదీ ప్రకటిస్తే తాను అదే రోజు అసెంబ్లీ నిర్వహించి అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతానంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రానికి తాగుబోతుల సంఘం అధ్యక్షుడిగా కేసీఆర్ భాద్యతలు నిర్వహిస్తున్నారంటూ సీఎం ఘాటుగా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా కాళోజీ కళాక్షేత్రం సహా పలు అభివృద్ధి పనులను, వరంగల్ – కరీంనగర్ రహదారిపై నయీంనగర్ వద్ద ఉన్న ప్రధాన రహదారిపై పూర్తయిన వంతెన నిర్మాణాన్ని వర్చువల్‌గా సీఎం ప్రారంభించారు.
అలాగే 22 మహిళా శక్తి భవనాలకు, అలాగే పలు అభివృద్ది కార్యక్రమాలకు సీఎం శంఖుస్థాపన చేశారు. ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పాలన మొదటి సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సభకు ఇందిరా మహిళాశక్తి ప్రాంగణంగా నామకరణం చేయగా, సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.
ఈ బహిరంగ సభలో కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి తాగుబోతుల సంఘం అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారంటే అది మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కేసిఆర్ ఫామ్ హౌస్ లోనే కూర్చోవాలని, కుదిరితే ప్రతిరోజు వైన్ షాప్ ద్వారా మద్యం సీసాలు అందేలా తాను చెబుతానంటూ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. మహిళల సంక్షేమానికి తాము పాటుపడుతుంటే, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రతి పథకాన్ని అడ్డుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తుందన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం.. మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, ఇప్పటికే ఫ్రీ బస్, గృహ జ్యోతి, 500 రూపాయలకే సిలిండర్ లను పంపిణీ చేస్తుందన్నారు.
బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులను తాము ఇప్పటికీ తీరుస్తున్నామని, పదేళ్ల కాలంలో కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తిచేసే మనసు కూడా కేసీఆర్ కు లేదన్నారు. వరంగల్ నగరం కేసిఆర్ చేతిలో మోసపోయిందని, తమ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ నగరానికి తలమానికంగా వరంగల్ ను తీర్చిదిద్దుతుంన్నారు.
Also Read: Lagacharla Case : లగచర్ల కేసులో కీలక నిందితుడు లొంగుబాటు..
ఎవరైనా ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధికి అడ్డుపడితే ఖచ్చితంగా ఊసలు లెక్కపెట్టిస్తానంటూ సీఎం హెచ్చరించారు. కిరాయి మనుషులను తీసుకువచ్చి, తెలంగాణలో శాంతిభద్రతల సమస్యను సృష్టించాలని చూస్తున్నారని, తమ పాలనలో అటువంటివి సాగవన్నారు. మహిళలకు ఫ్రీ బస్ పథకం ప్రవేశపెట్టితే ఓర్వలేని కేటీఆర్, ఖాకీ చొక్కా వేసుకుని నిరసన తెలిపారని, రామారావా.. డ్రామారావా అంటూ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ ఆదేశాలతో, రాహుల్ గాంధీ అధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడం కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావులు మానుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు.