CM Revanth Speech: జపాన్ పర్యటనలో భాగంగా తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమానికి.. ముఖ్య అతిథిగా హాజరై సీఎం మాట్లాడారు. తెలంగాణ ఐటీ, ఫార్మా రంగంలో ప్రగతి సాధించిందన్నారు. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ అభివృద్ధి చేసుకుందామని సీఎం అన్నారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుపడుతోందని మరోసారి ఫైరయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గుజరాత్‌లో మోడీ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుండు.. ప్రయాగరాజ్‌లో గంగానది ఒడ్డున రివర్ ఫ్రంట్ ఉంది.. మరి తెలంగాణలో మూసీ ప్రక్షాళన కావొద్దా? అని ప్రశ్నించారు. నీరు మన సంస్కృతి, అభివృద్ధికి ప్రతీక అన్నారు సీఎం.
నాలాల ఆక్రమణలు తొలగించొద్దా? చెరువు మధ్యలో నిర్మాణాలు కూల్చకుంటే.. రేపు ప్రకృతి క్షమిస్తుందా? అని ప్రశ్నించారు. మూసీ అభివృద్ధికి అడ్డుపడేదే BRS-BJP అన్నారు. ఢిల్లీ పరిస్థితి చూసి మనం గుణపాఠం నేర్చుకోవాలని సీఎం అన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ఆర్ ఆర్ ఆర్ రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి కీలకం అని పేర్కొన్నారు. తెలంగాణ అభివద్ధికి అందరి సహకారం అవసరం అని సీఎం వెల్లడించారు.
కాగా.. టోక్యోలో సీఎం టూర్ ముగిసింది. పర్యటనలో భాగంగా.. టోక్యోలో పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. భారీ పెట్టుబడులు ఆకర్షించేలా సీఎం పర్యటన కంటిన్యూ అవుతోంది. సాంకేతిక సహకారంపై వరుస చర్చలు, సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ మౌంట్ ఫుజి, అరకురయామా పార్క్‌లను సందర్శించి, ఓసాకాకు బయల్దేరుతారు. రేపు కిటాక్యూషు మేయర్‌తో సమావేశమవుతారు.
జపాన్‌లో సీఎం రేవంత్ మరో రెండు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు NTT డేటా, నెయిసా నెట్ వర్క్స్ సంయుక్తంగా ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి దాదాపు 10 వేల 500 కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు MOU కుదుర్చుకున్నాయి. మరోవైపు రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. 562 కోట్ల రూపాయల పెట్టుబడికి ఒప్పందం కుదిరింది. దీంతో తెలంగాణలో TTDI సర్జ్ అరెస్టర్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది.
టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో NTT డేటా, నెయిసా నెట్‌వర్క్స్ ప్రతినిధులు ఈ ఒప్పందంలో పాల్గొన్నారు. దేశంలో అతిపెద్ద AI కంప్యూట్ మౌలిక సదుపాయం అందుబాటులోకి రానుంది. 25,000 GPUలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన AI సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను సమకూరుస్తుంది. దేశంలో తెలంగాణను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపు దిద్దుకుంటుంది.
Also Read: జపాన్‌లో తెలంగాణ రైజింగ్.. రూ.10వేల కోట్ల పెట్టుబడులు..
500 మెగావాట్ల వరకు గ్రిడ్, పునరుత్పాదక విద్యుత్తు మిశ్రమంతో ఈ క్లస్టర్ నిర్వహిస్తారు. లిక్విడ్ ఇమ్మర్షన్ వంటి అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీలను అవలంబిస్తారు. ఈ ప్రాజెక్టును అత్యున్నత ఎన్విరాన్‌మెంటల్, సోషల్, గవర్నెన్స్ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తారు. ఈ క్యాంపస్ తెలంగాణలోని విద్యా సంస్థల భాగస్వామ్యంతో AI ప్రతిభను పెంపొందిస్తుంది. రాష్ట్ర డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌కు దోహదం చేస్తుంది.