Messi – CM Revanth Reddy: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ గోట్ ఇండియా – 2025 టూర్ సర్వత్రా ఆసక్తిరేపుతోంది. తన అద్భుత ఆటతీరుతో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న మెస్సీ మన దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతుండడంపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ ఆసక్తి, క్రేజ్ అంతా కూడా మెస్సీ పర్యటించనున్న కోల్‌కత్తా, ముంబై, ఢిల్లీలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తోంది. కానీ, హైదరాబాద్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.
ఎందుకంటే.. హైదరాబాద్‌లో ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో జరిగేది కేవలం మెస్సీ మ్యాచ్ కాదు. అది మెస్సీతో తలపడనున్న సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ అనే స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది. హైదరాబాద్‌లో మెస్సీ అడే మ్యాచ్‌లో రేవంత్ రెడ్డి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఒక రాజకీయ నేత, దిగ్గజ క్రీడాకారుడి మధ్య జరగనున్న ఈ పోరు ప్లేయర్ వర్సెస్ పొలిటీషియన్ మ్యాచ్‌గా ఇప్పటికే యావత్తు దేశం దృష్టిని ఆకర్షించింది. క్రీడా ప్రపంచంలో ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది.
ఫుట్ బాల్ ఆటను అమితంగా ఇష్టపడే సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతూ కనిపించారు. హైదరాబాద్‌లో టూర్ సందర్భంగా మెస్సీ టీం ముఖ్యమంత్రి టీంతో ఫ్రెండ్లీ మ్యాచ్ అడనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పనుల్లో ఎంత బిజీగా ఉన్న కూడా దిగ్గజ ఆటగాడితో తలపడేందుకు రేవంత్ రెడ్డి తన ఆటతీరుకు పదనుపెడుతున్నారు. హైదరాబాద్ ఎంహెచ్ఆర్డీలో రోజూ కొంత సమయాన్ని ప్రాక్టిస్ కోసం కేటాయిస్తున్నారు.
క్రీడలపై ఆసక్తి – క్రీడాకారులపై గౌరవం
క్రీడల్లో తెలంగాణ యువతను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం కొత్తది కాదు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి త్వరలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వరకు రాష్ట్రం నుంచి దేశానికి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందివ్వాలన్న తపన ఆయన ప్రయత్నాల్లో కనిపిస్తుంది. దేశంలోనే మొట్టమొదటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణలో నెలకొల్పాలనే ఆయన ఆలోచన మొదలుకొని, వివిధ ఈవెంట్లలో పతకాలు గెలిచి సత్తాచాటిన తెలంగాణ క్రీడాకారులను ఆర్థికంగా సాయం అందిస్తున్న తీరు క్రీడలపై ఆయనకున్న ఆసక్తి, క్రీడాకారులపై ఆయనకున్న గౌరవాన్ని సూచిస్తుంది.
క్రీడాకారులకు స్వర్ణయుగం
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి క్రీడాకారులకు స్వర్ణ యుగం నడుస్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. బాక్సర్ నికత్ జరీన్, క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, గొంగడి త్రిష, ధృతి కేసరి, హెప్టాథ్లాన్ అగసర నందిని, షూటర్ ధనుష్ శ్రీకాంత్, జిమ్నాస్ట్ నిషిక అగర్వాల్, గోల్ బాల్ క్రీడాకారులు పవన్ కల్యాణ్, సాయితేజ వంటి అనేక మంది క్రీడాకారులకు ఆర్థిక నజరానాలు ప్రకటించడం, వారిలో కొందరికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి వారందరినీ క్రీడల్లో మరింత రాణించేలా ప్రోత్సహిస్తున్నారు.
తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో భవిష్యత్తు ప్రకటన
ఇక తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రకటించినున్న 2047 విజన్ డాక్యుమెంట్‌లో రాబోయే రోజుల్లో తెలంగాణలో క్రీడా రంగం అభివృద్ధికి తీసుకోనున్న చర్యలను వెల్లడించనుంది. ఫిఫా-ఏఐఎఫ్ఎఫ్‌తో కలిసి ప్రపంచంలోనే రెండో మహిళల ఫుట్‌బాల్ అకాడమీ, అలాగే దేశంలోనే రెండో పురుషుల ఫుట్‌బాల్ అకాడమీ ఏర్పాటు సహా పలు జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీ నిర్వహణపై ప్రకటన చేయనుంది. ఇక ఇప్పటికే ‘తెలంగాణ క్రీడా పాలసీ-2025’ ద్వారా క్రీడారంగానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పన, క్రీడాకారులకు నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్తుకు బాటలు వేయడంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు.
ఒక రాజకీయ నేతగా ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ఆడుతుండడం కొత్తగా అనిపించవచ్చు.. కానీ క్రీడల పట్ల ఆయనకు ఉన్న ఆసక్తి కొత్తది కాదు. ఏది ఏమైనా ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో జరగబోయే మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవనున్నారు.
ALSO READ: IndiGo Airlines: ఇండిగో వివాదం.. ఇంతకీ దాని యజమాని ఎవరు? ఆయన ఆస్తుల విలువెంతో తెలుసా?