⦿ సీఎం వరుస రివ్యూలు
⦿ జనవరి ఫస్ట్ వీక్ నుంచి రేవంత్ సమీక్షలు
⦿ డిపార్ట్‌మెంట్ల వారీగా అధికారులతో భేటీలు
⦿ రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం..
⦿ కొత్త రేషన్ కార్డులు, కులగణన అంశాలపైనా సమీక్ష
⦿ మూసీ అభివృద్ధి, ఉద్యోగుల సమస్యలపై కూడా
⦿ మూడో వారంలో దావోస్ పర్యటనకు ముందే అధికారులకు దిశానిర్దేశం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ :
CM Revanth Reddy: దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాలు జనవరి 2న ముగియనుండడంతో ఆ తర్వాత వరుసగా పలు కీలక అంశాలపై ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షలు నిర్వహించనున్నారు. జనవరి ఫస్ట్ వీక్‌లో మొదలయ్యే ఈ రివ్యూలు మూడో వారంలో దావోస్ పర్యటనకు వెళ్లేంత వరకు కొనసాగించే అవకాశమున్నది. రైతుభరోసా పంపిణీ, రైతుకూలీలకు ఏటా రూ.12 వేల సాయం, కొత్త రేషన్ కార్డుల జారీ, కులగణన సర్వే రిపోర్టు అధ్యయనం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల నిర్వహణ తేదీలపై కసరత్తు తదితర అంశాలపై చర్చించి విధాన నిర్ణయాలు తీసుకునేందుకు మంత్రివర్గ సమావేశాన్ని కూడా నిర్వహించే అవకాశమున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం.
వీటికి తోడు మూసీ నది ప్రక్షాళన, ఆర్థిక వనరుల సమీకరణపై కేబినెట్ సబ్‌కమిటీ ఇచ్చిన రిపోర్టుపై అధ్యయనం, ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం తదితరాలపైనా సీఎం దృష్టి సారించినున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఈ నెల 20-25 తేదీల మధ్య స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరిగింది. ఈ సదస్సుకు వెళ్లడానికి ముందే పలు కీలక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి విధాన నిర్ణయాలు తీసుకుని అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
సంక్రాంతి తర్వాత రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు స్వయంగా సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. ఈ స్కీమ్ అమలుకు అవసరమైన మార్గదర్శకాల (విధి విధానాలు) రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే జిల్లాల్లో పర్యటించి రైతుల, రైతుసంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకుంది. రిపోర్టును కూడా తయారుచేసింది. దీనిపై రెండు రోజల క్రితం నలుగురు మంత్రులతో కూడిన ఆ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై చర్చించింది.
ఈ అంశాలను ముఖ్యమంత్రికి వివరించిన తర్వాత కేబినెట్‌లో చర్చించి విధాన నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. దావోస్ టూర్‌కు వెళ్ళడానికి ముందే రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశముంది. త్వరలోనే దీనిపై మంత్రులు, కేబినెట్ సబ్ కమిటీ, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం.
గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల (సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ) నిర్వహణకు సంబంధించిన కసరత్తు రెండు నెలల క్రితమే మొదలైంది. ఇందులో భాగంగా ఇంటింటి కుటుంబ సర్వే జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జనాభా వివరాలు ఈ సర్వే నివేదికల్లో వెల్లడి కానున్నాయి. దరఖాస్తుల కంప్యూటరీకరణ (డిజిటలైజేషన్) దాదాపుగా పూర్తయినట్లు నోడల్ ఏజెన్సీగా ఉన్న ప్లానింగ్ డిపార్ట్‌మెంటు సిబ్బంది సూచనప్రాయంగా తెలిపారు.
దీన్ని త్వరలోనే డెడికేటెడ్ కమిషన్‌కు పంపి బీసీ రిజర్వేషన్ ఫార్ములాను ప్రభుత్వం తెప్పించుకుంటుందని తెలిపారు. ఈ అంశంపైన కూడా సీఎం రేవంత్ వివిధ విభాగాల అధికారులతో సమీక్షించే అవకాశముంది. ఇక కొత్త రేషన్ కార్డుల జారీ, మూసీ నది ప్రక్షాళన పురోగతి, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం తదితర అంశాలపైనా ముఖ్యమంత్రి రివ్యూ చేసే అవకాశాలున్నాయి.