తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు మహారాష్ట్రకు బయలుదేరనున్నారు. ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో అధిష్టానం రేవంత్ రెడ్డిని మహా ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ గా నియమింది. ఉదయం 8 గంటలకు సీఎం శంషాబాద్ విమానాశ్రయం నుండి ముంబై బయలుదేరుతారని సమాచారం. మహరాష్ట్రలో ఇతర రాష్ట్రాల సీఎంలతో కలిసి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. పర్యటన తరవాత తిరిగి ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది.
Also Read: రాత్రి గంటసేపు భేటీ, వైసీపీ సోషల్ కాలకేయులు.. 500 మంది లిస్టులో వారు కూడా?
మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను అధిష్టానం జార్కండ్ లో జరగనున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది. ఆయన కూడా ఈ రోజు జార్ఖండ్ వెళుతుంగా నేడు, రేపు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. తిరిగి రేపు రాత్రి హైదరాబాద్ కు తిరుగు పయనం అవుతారు. ఇదిలా ఉంటే సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు చాలా కష్టపడ్డారు. భట్టి తన పాదయాత్రతో ప్రజల్లోకి వెళితే, సీఎం రేవంత్ పీసీసీగా పార్టీని గాడిలో పెట్టారు. అదే విధంగా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి తనదైన రీతిలో ప్రజలకు ఆకట్టుకున్నారు.
దీంతో మహారాష్ట్రంలో సీఎం, జార్ఖండ్ లో డిప్యూటీ సీఎంలను ప్రచారంలో దింపితే మేలు జరుగుతుందని భావించినట్టు తెలుస్తోంది. అదే విధంగా తెలంగాణలో అమలు అవుతున్న పథకాల గురించి ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలు, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం, వచ్చిన పది నెలల్లోనే ఉద్యోగ నియామకాలు, నియామక పత్రాలు అందజేయడం, మహిళలకు ఫ్రీ బస్ పథకాలను అస్త్రాలుగా చేసుకుని ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి సిద్దం అవుతోంది.