CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సొంతపార్టీ ఎమ్మెల్యేలపై ఫస్ట్ టైమ్ సీరియస్ అయ్యారు. మంత్రి పదవులపై ఇటీవల రాజగోపాల్‌రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పదవులు రావని.. మీరే నష్టపోతారని తేల్చి చెప్పారు. మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే దానిపై అధిష్టానమే ఫైనల్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పార్టీ లైన్ దాటి ఎవరూ కామెంట్స్ చేయొద్దంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
వీకెండ్ పాలిటిక్స్‌పై సీరియస్
పలువురు ఎమ్మెల్యేల తీరుపైనా సీఎం గుస్సా అయ్యారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని.. జరుగుతున్న విష ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండించాలని ఆదేశించారు. చాలా మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉంటున్నారని.. అలా వీకెండ్ రాజకీయాలు కుదరవని.. ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చెప్పారు. సీఎల్పీ మీటింగ్‌కు పర్ఫార్మెన్స్ రిపోర్ట్ తో రావాలని సీఎం ఆదేశించడంతో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ఏడాది యాక్టివిటీస్ రిపోర్టుతో వచ్చారు. ఎమ్మెల్యేలు మరింత స్పీడ్‌గా పని చేయాలని గట్టిగా హెచ్చరించారు సీఎం రేవంత్.
నో రిలాక్స్.. ఓన్లీ హార్డ్ వర్క్
ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకూ క్లాస్ ఇచ్చారు ముఖ్యమంత్రి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. పనులు చేస్తూ జనాల్లో ఉండాలని చెప్పారు.
ఎమ్మెల్యే కాగానే రిలాక్స్ అవుతామంటే కుదరదని.. కష్టపడి పని చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.
మోదీ ఉక్కిరిబిక్కిరి..
కంచ గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్, బీజేపీ, ప్రధాని మోదీ చేస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. HCU భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో అబద్ధపు ప్రచారం చేసిందని.. అది నమ్మి పీఎం మోదీ సైతం అడవుల్లోకి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని అన్నారు. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారిందని.. కులగణన బీజేపీ సర్కారుకు మరణ శాసనం రాయబోతోందని.. దేశంలో తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతోందని ముఖ్యమంత్రి అన్నారు.
Also Read : రేవంత్ సర్కారును పడగొడతారా? కొత్త మంటలు..
ప్రజల్లోకి ప్రజాపాలన.. సీఎం డైరెక్షన్
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని చెప్పారు. సన్న బియ్యం మన పథకం.. మన పేటెంట్.. మన బ్రాండ్.. అన్నారు. భూ భారతిని రైతులకు చేరువ చేయాలని పిలుపు ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందాలన్నారు. కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ.. కాంగ్రెస్ పారదర్శక పాలనకు నిదర్శనమని తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలని ఆదేశించారు. తాను సైతం మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజల్లోకి వస్తానన్నారు సీఎం రేవంత్. మనం ఎంత మంచి చేసినా.. ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదన్నారు. నియోజకవర్గానికి ఏం కావాలో ఎమ్మెల్యేలంతా ఒక నివేదిక రెడీ చేసుకోవాలని.. ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.