జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోయి ఉంటే అసంతృప్త స్వరాలు రెచ్చిపోయి ఉండేవి. సీఎం రేవంత్ రెడ్డి మరింతగా ప్రతిపక్షాలకు టార్గెట్ అయ్యేవారు. అధిష్టానానికి లేనిపోనివి చెప్పే పితూరీదారులు కూడా పెరిగేవారు. కానీ ఒకేసారి అందరి నోళ్లు మూతబడేలా చేసింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం. దీంతో పార్టీలో రేవంత్ నాయకత్వం మరింత బలపడే అవకాశముంది.
రేవంత్ క్రేజ్..
తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అవుతారని అందరూ ఊహించారు. కానీ ఆ ప్రకటన వెనక ఎన్నో చర్చోపచర్చలు జరిగాయి. ఎంతోమంది పుల్లలు అడ్డువేసేవారు తెరపైకి వచ్చారు. రేవంత్ సీఎం అయితే తమ ప్రయారిటీ తగ్గిపోతుందనే బ్యాచ్ కూడా తెర వెనక చాలా ప్రయత్నాలు చేసింది. కానీ అధిష్టానం రేవంత్ రెడ్డిపై అపార నమ్మకం ఉంచి ఆయన్ను ముఖ్యమంత్రిని చేసింది. ఆ నమ్మకాన్ని ప్రతి దశలోనూ నిలబెట్టుకుంటూ వస్తున్నారు రేవంత్ రెడ్డి. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో రేవంత్ రెడ్డి ప్రభ మరింత పెరిగిందనే చెప్పాలి.
జూబ్లీహిల్స్ లో జోరుగా ప్రచారం
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. పైగా ఆ పార్టీ ఎమ్మెల్యే మరణించడం ద్వారా వచ్చిన సింపతీ, ఆ కుటుంబం నుంచే అభ్యర్థిని బీఆర్ఎస్ ఎన్నుకోవడం.. ఇలాంటివన్నీ ఆ పార్టీకే అనుకూలంగా మారాయి. కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి పోల్ మేనేజ్ మెంట్ ముందు ఆ అనుకూలతలన్నీ తారుమారయ్యాయి. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే విషయంలో కూడా రేవంత్ రెడ్డి మాటకు అధిష్టానం విలువ ఇచ్చింది. అంతే కాదు ఉప ఎన్నికల ప్రచార బాధ్యతను కూడా ఆయన భుజాలపైనే పెట్టింది. సీఎంగా పాలనలో బిజీగా ఉంటూనే ఇటు ఉప ఎన్నిక ప్రచార పర్వం మొత్తాన్ని తానే ముందుండి నడిపించారు రేవంత్ రెడ్డి. అటు బీఆర్ఎస్ తరపున కేసీఆర్ అస్త్ర సన్యాసం చేయడంతో కేటీఆర్ ముందుకొచ్చారు. కేటీఆర్ కి తోడు హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు అందరూ కలసి మాగంటి సునీత కోసం ప్రచారం చేపట్టారు. కానీ చివరకు కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ విజయం రేవంత్ రెడ్డి ఖాతాలో పడింది.
ఛాన్స్ మిస్సయింది..
ఎన్నికల సమయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డిని అధిష్టానం పిలిపించుకుని మందలించిందని వైరి వర్గం ఓ రేంజ్ లో ప్రచారం చేసింది. సీఎం మార్పు తథ్యమంటూ ఊదరగొట్టింది. ఒకవేళ జూబ్లీ ఫలితం కాంగ్రెస్ కి వ్యతిరేకంగా వచ్చి ఉంటే ఈ ప్రచారం మరింత ఊపందుకునేది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని తట్టుకోవడం అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీకి సాధ్యం కావడం లేదు. సీఎం పోస్ట్ లో ఇంకెవరైనా ఉంటే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయం ఖాయమని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. కానీ వారికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి. రేపు స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభంజనం వీయడం ఖాయమని విశ్లేషకులంటున్నారు.
Also Read: కాంగ్రెస్ జోరు.. మరింత హుషారుగా స్థానిక పోరుకు తయారు
Also Read: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ప్రభంజనం.. నవీన్ యాదవ్ భారీ విజయం