Mohan Babu Arrest : టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట జరిగిన ఫ్యామిలీ రచ్చ ఇటీవల మరో వివాదానికి తెర తీసిన సంగతి తెలిసిందే. ఆయన ఓ జర్నలిస్ట్ పై దాడి చేయడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోని మోహన్ బాబుపై కేసు నమోదు కాగా, తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తే మరి కాసేపట్లో ఆయన అరెస్టు కావడం ఖాయమని టాక్ నడుస్తోంది.
రీసెంట్ గా మంచు మోహన్ బాబు, ఆయన కొడుకు మంచి మనోజ్ మధ్య ఫ్యామిలీ వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ గొడవకు సంబంధించి మూడు రోజులపాటు హై డ్రామా జరగగా, నిన్న ఎట్టకేలకు వివాదం సద్దుమణిగింది. అయితే గొడవ జరుగుతున్న సమయంలోనే జలపల్లి లోని తన నివాసంలో మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేసిన ఘటన ఆయనను మరో సమస్యలో ఇరికించింది. ముఖ్యంగా జర్నలిస్ట్ సంఘాలు ఘటనపై భగ్గుమన్నాయి. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంటూ నిరసనకు దిగారు.
దీనికి సంబంధించి పహాడి షరీఫ్ పోలీసులు హత్యయత్నం కేసు కింద మోహన్ బాబు పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మొదట మోహన్ బాబుపై 118 (1) బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అనంతరం లీగల్ ఒపీనియన్ తీసుకుని గురువారం 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసును కూడా పహాడి షరీఫ్ పోలీసులు మోహన్ బాబుపై నమోదు చేశారు. అయితే మరోవైపు ఈ కేసుకు సంబంధించి మోహన్ బాబు హైకోర్టులో ముందస్తు మెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. పోలీసులు ఈ కేసు పై దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో రిక్వెస్ట్ చేశారు.
తాజాగా ఆ పిటిషన్ విచారణకు రాగా, ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో మోహన్ బాబుకు షాక్ తగిలింది. పోలీసులకు తదుపరి దర్యాప్తు చేయకుండా, తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న మోహన్ బాబు రిక్వెస్ట్ ను హైకోర్టు కొట్టి పారేసింది. అలాగే ఈ పిటిషన్ కు సంబంధించిన విచారణలను గురువారానికి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబును అరెస్ట్ చేయబోతున్నారని వార్త బయటకు వచ్చింది.
ఇప్పటికే టాలీవుడ్ లో అల్లు అర్జున్ అరెస్ట్ విషయం హీటెక్కిస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో మరో సినీ సెలెబ్రెటీ మోహన్ బాబు అరెస్టు కాబోతున్నారంటూ వస్తున్న వార్త వైరల్ గా మారింది. మరి నిజంగానే పోలీసులు మోహన్ బాబు అరస్ కి రంగం సిద్ధం చేశారా? ఈ వార్తలు నిజమైతే ఆయనను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? ఆ తర్వాత జరగబోయే పరిణామాలేంటి? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా ముందుగా ఈ విషయంలో తన తప్పేమీ లేదని అన్నారు మోహన్ బాబు. కానీ తరువాత దిగివచ్చి క్షమాపణలు చెప్పక తప్పలేదు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్ ను రిలీజ్ చేస్తూ, ఆ ఘటనపై సుధీర్ఘ వివరణ ఇస్తూ క్షమాపణలు కోరారు మోహన్ బాబు.