CM Revanth Reddy: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తిగా వాస్తవ రూపం దాల్చుతుందని సీఎం అన్నారు. బడ్జెట్ లెక్కల్లో ఎలాంటి గందరగోళం లేకుండా చూశామని చెప్పారు. చేసేదే చెబుతా.. చెప్పిందే చేస్తాం అనే విధానంతో బడ్జెట్ ప్రవేశపెట్టామని అన్నారు. తాము ప్రవేశ పెట్టిన బడ్జెట్ 95 శాతం నిజం కాబోతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
25 ఏళ్లుగా సెంట్రల్ యూనివర్సిటీ భూములపై నిర్లక్ష్యం వహించారని అన్నారు. ‘ఆ భూములను మేం ఎవరికీ కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు. అయినా కావాలని విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. పెట్టుబడులు రాకుండా కుట్ర చేస్తున్నారు. మేం మంచిని మంచి.. చెడును చెడుగా చూస్తాం. మమ్మల్ని బద్నాం చేయాలని చూస్తే కుదరదు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు వచ్చి కలిశారు. ఆయన చెప్పిన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించాం. గజ్వేల్ ఎమ్మెల్యేగా వచ్చినా కలుస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం ఘటనపై కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘శాంతి భద్రతలపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా కుట్రలు పన్నుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో దిశ ఘటన జరిగింది. వామనరావు దంపతులను నడిరోడ్డుపై చంపారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో బీఆర్ఎస్ నేత కుమారుడు ఉన్నా చర్యలు తీసుకోలేదు. ఎంఎంటీఎస్ ఘటనపై మేం వెంటనే స్పందించాం’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
‘మా అత్తగారి ఊరికి రోడ్డు వేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఆర్ఆర్ఆర్ కు రేడియల్ రోడ్ నిర్మిస్తున్నాం. ఫ్యూచర్ సిటీ కట్టాలో వద్దో హరీష్ రావు చెప్పాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం భూసేకరణ చేస్తుంటే వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. 25 ఏండ్ల క్రితం బిల్లీరావుకు గచ్చిబౌలిలో భూమిని కేటాయించారు. ఆ భూమితో సెంట్రల్ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటి వరకు బిల్లీరావు నుంచి భూమిని వెనక్కు తీసుకోలేదు. ఆ భూమిలో గుంట నక్కలు ఉన్నాయి. ఆ గుంట నక్కలకి గుణపాఠం చెబుతాం. ఓపెన్ యాక్షన్ ద్వారా పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలకు ఇవ్వాలని ముందుకు వస్తే.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అని సీఎం చెప్పారు.
‘అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులకు తీసుకొచ్చేందుకు అక్కడ విస్తరణ చేయాలనుకుంటున్నాం. హరీష్ రావును సూటిగా అడుగుతున్నా. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలా వద్దా..? రేడియల్ రోడ్లు వేయాలా వద్దా..? అభివృద్ధి కోసం భూములు సేకరించాలా వద్దా..? కొండపోచమ్మ సాగర్ నుంచి ఫామ్ హౌస్ లకు డైరెక్టు కాలువలు తీసుకెళ్లింది ఎవరు..?ప్రతీది అడ్డుకోవాలనే కుట్ర ఏ రకంగా మంచిది?. మేం తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం.. మొత్తం తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. మీ కుట్రలు, కుతంత్రాలకు, అసెంబ్లీలో మైకును వాడుకుంటామంటే ఒప్పుకోం’ అని సీఎం ఫైరయ్యారు.
‘అభివృద్ధి, భూసేకరణ విషయంలో మీరు అడ్డుపడకండి. పరిహారం ఏం ఇవ్వాలో సూచనలు చేయండి. ఇది ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చేదే తప్ప.. ఎవరి ఇంట్లో నుంచి ఇచ్చేది కాదు. మల్లన్న సాగర్ లో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసులు వేయించింది వాళ్లే, పార్టీలో చేర్చుకున్నది వాళ్లే. ఆనాడు పార్టీ మారిన వాళ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఉప ఎన్నికలు రాలేదు. గతంలోనే రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి? గతంలో ఆచరించిన సంప్రదాయాలనే ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం’ అని సీఎం పేర్కొన్నారు.
‘సభ్యులెవరూ ఆందోళన చెందొద్దు.. ఏ ఉప ఎన్నికలు రావు. మా దృష్టి ఉప ఎన్నికలపై లేదు. మా దృష్టి రాష్ట్ర అభివృద్ధిపైనే ఉంది. ప్రతిపక్షానికి మేం సూచన చేస్తున్నాం. మీ పై మాకు ద్వేషం లేదు.. ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో శిక్షించారు. ఇక మీపై మాకు కోపం ఎందుకుని ఉంటుంది? ప్రభుత్వానికి సహేతుకమైన సలహాలు, సూచనలు ఇవ్వండి.’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ALSO READ: HPCL Recruitment: మీకు ఈ ఉద్యోగం వస్తే.. లక్షకు పైగా జీతం.. ఈ అర్హత ఉంటే ఎనఫ్