Collector Manu Choudhary: మేడ్చల్ స్వేచ్ఛ:రాబోయే కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మరియు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ డీ. విజయేందర్ రెడ్డితో కలిసి కీసరగుట్ట ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Also Read: GHMC: జీహెచ్ఎంసీలో రేపటి నుంచి స్పెషలాఫీసర్ పాలన? కీలక ఆదేశాలు జారీ చేయనున్న సర్కారు!
ఈ సందర్భంగా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల పనితీరును సమీక్షించిన కలెక్టర్, ఆలయ పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.పార్కింగ్, కొబ్బరికాయలు మరియు ఇతర పూజా సామాగ్రి ధరల నియంత్రణ కోసం మూడు విభాగాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి పర్యవేక్షణ కొనసాగిస్తామని కలెక్టర్ తెలిపారు.
ఆలయ వేదపండితులు మరియు అధికారులు కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 నుండి 18 వరకు జరుగుతాయని తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. కొబ్బరికాయలు మరియు పూజా సామాగ్రిని అధిక ధరలకు విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.