
Congress News Telangana: ఖమ్మం ఖిల్లా నుంచి పోరాటాలకు శ్రీకారం చుడుతోంది కాంగ్రెస్. విద్యార్థి, నిరుద్యోగ నిరసన ప్రదర్శనతో ప్రభుత్వంపై పోరాటాన్ని ముమ్మరం చేయబోతోంది. ఖమ్మంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సాయంత్రం 4 గంటలకు భారీ ప్రదర్శనను కాంగ్రెస్ నేతలు చేపట్టనున్నారు. మయూరి సెంటర్ పాత బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగుతుంది. ఆ తర్వాత భారీ సభ నిర్వహిస్తారు.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ నాయకులు ఉద్యమబాట పడుతున్నారు. ముఖ్యంగా TSPSC పేపర్ల లీకేజీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే న్యాయపోరాటం కూడా మొదలుపెట్టిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు నేరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి.. ప్రజల మద్దతు కూడగట్టాలని నిర్ణయించారు. ఉద్యోగ నియామకాల్లో నిర్లక్ష్యం.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం, విద్యార్థి వ్యతిరేక విధానాలు లాంటి అంశాలపై ఉద్యమాన్ని విస్తృతం చేయనున్నారు.
విద్యార్థి, నిరుద్యోగ నిరసన ప్రదర్శనకు ఖమ్మం నుంచి శ్రీకారం చుట్టడం వెనక రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరవుతారు. పలువురు సీనియర్ నేతలు కూడా పాల్గొంటారు. ఇప్పటికే కొందరు నాయకులు ఖమ్మం చేరుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నిరుద్యోగులు, విద్యార్థులు ఈ సభకు భారీగా తరలిరావాలని టీపీసీసీ పిలుపునిచ్చింది.
మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని తొలగించినందుకు నిరసనగా ఈనెల 27న గాంధీభవన్‌లో పార్టీ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నారు. ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతోంది.