Meenakshi Natarajan: తెలంగాణ నూతన ఏఐసీసీ ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ ను నియమిస్తూ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో దీపాదాస్ మున్షీ భాద్యతలు నిర్వర్తించారు. మీనాక్షి నటరాజన్ ను నియమిస్తూ పార్టీ అధిష్టానం ప్రకటించడంపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. మొత్తం 9 రాష్ట్రాలకు ఇంచార్జ్ లను మార్చగా అందులో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇంచార్జ్ ను మార్పు చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.
సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మీనాక్షీ నటరాజన్, ప్రస్తుతం రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన్ జాతీయ అధ్యక్షురాలు గా పని చేస్తున్నారు. నిజాయితీ గల మహిళా నేతగా పేరుగాంచి, పార్టీలో అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ.. మీనాక్షీ నటరాజన్ నేడు తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్ గా నియమితులయ్యారు. 1999 -2000 సంవత్సరంలో మీనాక్షి నటరాజన్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు గా పనిచేశారు.
ఆ సమయంలో తెలంగాణ రాష్ట్ర నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులుగా ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ కొనసాగారు. ప్రస్తుతం మహేష్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న సమయంలో తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ నియమితులు కావడంపై మహేష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
Also Read: ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేశారా.. ఒక్క క్లిక్ తో స్టేటస్ తెలుసుకోండి
అలాగే ఇప్పటి వరకు ఏఐసీసీ ఇంచార్జ్ గా కొనసాగిన దీపాదాస్ మున్షి పార్టీని పటిష్టం చేయడంలో విశేష కృషి చేశారని మహేష్ గౌడ్ కొనియాడారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలు కూడా మీనాక్షి నటరాజన్ నియమితులు కావడంపై అభినందనలు తెలిపారు. ఐక్యత, దృఢ సంకల్పంతో మీనాక్షీ సారథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మేల్యేలు, నాయకులు అభినందనలు తెలిపారు.