
Congress : కాంగ్రెస్ అగ్రనేతలు హైదరాబాద్‌కు క్యూకట్టారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే స్వాగతం పలికారు. కాంగ్రెస్ అగ్రనేతలు రెండ్రోజులు హైదారాబాద్‌లోనే ఉంటారు. తాజ్ కృష్ణ హోటల్ 2 రోజులపాటు CWC సమావేశాలు జరుగుతాయి.
17 ఏళ్ల తర్వాత హైదరాబాద్ CWC సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు 3 నెలల సమయం కూడాలేదు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. పార్టీ వైపు ప్రజల దృష్టి మళ్లించడం లక్ష్యంగా పెట్టుకుంది. CWC సమావేశాలకు 39 మంది సీడబ్ల్యూసీ జనరల్ సభ్యులు, 18 మంది శాశ్వత ఆహ్వానితులు, 14 మంది ఇంఛార్జ్‌లు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురు ఎక్స్‌అఫిషియో సభ్యులు హైదరాబాద్‌కు వచ్చారు. సమావేశంలో మొత్తం 90 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.
తొలి రోజు జరిగే భేటీలో దేశ రాజకీయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. 5 కీలక అంశాలపై చర్చించనున్నారు. త్వరలోనే జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, రెండో విడత భారత్ జోడో యాత్ర , సార్వత్రిక ఎన్నికలు, ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం.. ఇలాంటి అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం.
దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అదానీ వ్యవహారం, ఎన్డీఏకు వ్యతిరేకంగా ఇండియా కూటమి నేతృత్వంలో చేపట్టాల్సిన పోరాట కార్యాచరణ, ఇండియా కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలను ఆయా రాష్ట్రాల్లో ఎదుర్కోవాల్సిన తీరు లాంటి అంశాలపై CWC సమావేశాల్లో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగే తాజ్‌కృష్ణాలో రాహుల్ భారత్ జోడో యాత్ర విశేషాలు తెలిపే విధంగా ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రాహుల్ విభిన్న ప్రాంతాల్లో పాదయాత్ర చేసిన ఫోటోలను ఉంచారు. మరోవైపు ఆదివారం సాయంత్రం తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ జరగనుంది.