Minister Coordination: స్వేచ్ఛ బ్యూరో: కొన్ని జిల్లాల అధికార శాసన సభ్యులకు కొత్త చిక్కులు వచ్చాయి. ఇన్ చార్జ్ మంత్రులు, సొంత జిల్లా మంత్రుల మధ్య సరైన సమన్వయం లేక ఎమ్మెల్యేలు మధ్యలో నలిగిపోతున్నట్లు తెలిసింది. నియోజకవర్గాల డెవలప్ మెంట్ కోసం శాసన సభ్యులు ప్రయత్నిస్తున్నా.. ఇన్ చార్జ్, సొంత జిల్లా మంత్రుల మధ్య నెలకొన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దక్షిణ తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే తెలిపారు.
వాస్తవానికి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ప్రజలు ఒత్తిడి తెస్తుంటే, మరోవైపు ఇద్దరు మంత్రుల మధ్య సమన్వయ లోపం ఎమ్మెల్యేల గొంతులో పచ్చివెలక్కాయలా మారింది. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, అదే జిల్లాకు చెందిన స్థానిక మంత్రి మధ్య సాగుతున్న కమ్యూనికేషన్ గ్యాప్స్, ఆధిప్యత పోరులో శాసనసభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటకు చెప్పుకోలేక, లోపల భరించలేక మనోవేదనకు గురవుతున్నారు. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఎమ్మెల్యే పార్టీ దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. పార్టీ కూడా ఈ అంశంపై త్వరలోనే సమన్వయ మీటింగ్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
నియోజకవర్గానికి ఏ ప్రాజెక్టు ముందుగా రావాలి? ఏ గ్రామానికి నిధులు కేటాయించాలి? అనే విషయంలో ఇన్ చార్జ్ మంత్రులు ఒక రకమైన ప్రాధాన్యతలు ఇస్తుంటే, సొంత జిల్లా మంత్రులు మరొక జాబితాను తెరపైకి తెస్తున్నారు.తాము సొంత జిల్లా మంత్రులమనీ, తమకు జిల్లా ప్రయారిటీస్ ఐడియా ఉన్నదని ఆ మంత్రులు చెప్తుండగా, అధికారుల రిపోర్టు, సర్వేలు, ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా తాము ముందుకు సాగుతామని ఇన్ చార్జ్ మంత్రులు తేల్చి చెప్తున్నారట. అంతేగాక ఇన్‌ఛార్జ్ మంత్రులు జిల్లా రివ్యూ మీటింగ్‌లలో ఆమోదించిన ప్రతిపాదనలపై స్థానిక మంత్రులు సంతృప్తిగా ఉండటం లేదు. ఇది కమ్యూనికేషన్ గ్యాప్స్ కు దారీ తీస్తుందనే చర్చ ఉన్నది. ఈ నేపథ్యంలో ఇద్దరిలో ఎవరి మాటకు ప్రాధాన్యమివ్వాలో తెలియక నియోజకవర్గ శాసన సభ్యులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.
Also Read: భారీ వర్షాల హెచ్చరిక.. ఐటీ కంపెనీలకు కీలక సూచన, అడ్వైజరీ జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు
ఇద్దరు కీలక మంత్రుల్లో సమన్వయం లేకపోవడంతో రహదారుల నిర్మాణాలు, డ్రైనేజీ వ్యవస్థలు, ప్రభుత్వ భవనాల మంజూరు వంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపాదనల దశలోనే ఆగిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇన్‌ఛార్జ్ మంత్రి శంకుస్థాపనకు సిద్ధమైతే, స్థానిక మంత్రి వర్గం నుంచి అభ్యంతరాలు వస్తున్నాయట. ఒకవేళ స్థానిక మంత్రి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇన్‌ఛార్జ్ మంత్రి కేటాయింపులను నిలిపివేస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో శాసన సభ్యులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.
హైకమాండ్ వద్దకు వెళ్తే ఎక్కడ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారోననే భయంతో ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి కూడా గట్టిగా తీసుకెళ్లలేకపోతున్నారు. ఇదే క్రమంలో నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల నాయకులు, ప్రజలకు ఆయా ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు.ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే పార్టీ నష్టపోతుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం త్వరలోనే ఉంటుందని ఓ సీనియర్ నాయకుడు తెలిపారు.
Also Read: Krishna Politics: మీ దొంగ ప్రచారాలు, నాటకాలు ఆపండి.. మంత్రి వాకిటి శ్రీహరి ఫైర్!