Parents Arrested for Killing Own Daughter: కూతుర్ని అల్లారుముద్దుగా పెంచుకున్నారు ఆ తల్లిదండ్రులు. కాకపోతే వింత ప్రవర్తన ఉండేది. పెళ్లయిన తర్వాత తగ్గుతుందని భావించారు. అయినా కూతురులో మార్పు రాలేదు. విసిగిపోయిన ఆ తల్లిదండ్రులు.. అత్తింటి నుంచి పిలిచి దారుణంగా హత్య చేశారు. పైగా చేతబడి కారణంగా చనిపోయిందని మభ్యపెట్టి అడ్డంగా దొరికిపోయారు. సంచలనం రేపిన ఈ ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఈ కేసు డీటేల్స్‌లోకి వెళ్తే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెల్ల ప్రాంతానికి చెందిన నర్సయ్య- ఎల్లవ్వ దంపతుల పెద్ద కూతురు ప్రియాంక. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కాకపోతే ప్రియాంకకు చిన్న సమస్య ఉండేది. నిత్యం మానసిక వ్యాధితో బాధపడేది. కూతురు పరిస్థితి గమనించిన ఆ తల్లిదండ్రులు చాలా ఆసుపత్రులకు తిప్పారు. అయినా ఫలితం దక్కలేదు. తాము ఏం పాపం చేశామని దేవుడు ఇలాంటి కూతురు ఇచ్చారని మనసులోని బాధపడేవారు.
చివరకు నాలుగేళ్ల కిందట సిద్ధిపేటలోని దర్గాపల్లికి చెందిన పృథ్వీతో వివాహం చేశారు. ప్రస్తుతం కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీలో ఉంటున్నారు. వీరికి 13 నెలల బాలుడు ఉన్నాడు. పెళ్లి చేసినా కూతురు ప్రవర్తనలో మార్పు రాలేదు. మునుపటి మాదిరిగానే మానసిక వ్యాధితో బాధపడేది. చుట్టుపక్కన వారిని ఇబ్బందిపెట్టేది. తరచూ గొడవలు జరగడంతో విసిగిపోయిన ప్రియాంక భర్త అత్తింటివారికి కబురు పెట్టారు. ఆ తర్వాత చాలా మందితో మాట్లాడి పూజలు సైతం చేయించారు. కూతురుని వెంటబెట్టుకుని తిరగని దేవాలయాలు లేవు. అయినా ఫలితం శూన్యమైంది.
Also Read: ఐదేళ్లుగా డేటింగ్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
కొద్దిరోజుల కిందట ప్రియాంకను ఇంటికి తీసుకొచ్చారు పేరెంట్స్. రోజురోజుకూ కూతురు టార్చర్ పెరిగి పోవడంతో నానాఇబ్బందులు పడ్డారు. చివరకు ఆమెని చంపితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించారు. అనుకున్నట్లు ప్లాన్ చేసి అర్థరాత్రి కూతుర్ని హత్య చేశారు. ఈనెల 15న అత్తింటికి కబురు పెట్టారు. చేతబడి వల్ల చనిపోయిందని నమ్మించి అంత్యక్రియలు నిర్వహించారు. ఇక్కడవరకు స్టోరీ బాగానే నడిచింది.
ప్రియాంక మరణంపై గ్రామస్థులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వెంటనే తల్లిదండ్రులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.