Gold Tiffin Box Theft case: నిజాం మ్యూజియంలో టిఫిన్ బాక్స్ చోరీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ చోరీ ఒక సంచలనం. ఆ చోరీకి పాల్పడిన నిందితునికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పు ఇచ్చింది మాత్రం ఈ కేసులో కాదు.. వేరే హత్య కేసులో. ఇక అసలు విషయంలోకి వెళితే..
హైదరాబాద్‌లోని పురాతన, విలాసవంతమైన మ్యూజియాల్లో నిజాం మ్యూజియం ఒకటి. ఇది పురానా హవేలీలో ఉంది. 2000 లో దీనిని ప్రారంభించారు. నిజాంల పాలనలో వాడిన ఒక రాజభవనమే ఇది. ఇక్కడి విశేషాలు చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు. ఈ మ్యూజియాన్ని చూడని హైదరాబాదీ ఎవరూ ఉండరు. అయితే ఇక్కడ జరిగిన ఓ చోరీ పెను సంచలనమే. ఆ చోరీ ఏమిటో తెలుసుకుందాం.
టిఫిన్ బాక్స్ మరీ ఇంత స్పెషలా..
నిజాం నవాబులు వాడిన ఏ వస్తువైనా ఖరీదైనదే. ఎందుకని ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, వీరు వాడిన టిఫిన్ బాక్స్ అటువంటిది. ఈ టిఫిన్ బాక్స్ బంగారం, రజతంతో తయారు చేసిన ఓ అద్భుతం. నిజాం మ్యూజియంలో ఉన్న అపురూప వస్తువులలో టిఫిన్ బాక్స్ ఒకటి. ఈ మ్యూజియం సందర్శనకు వచ్చిన వారు తప్పక, ఈ టిఫిన్ బాక్స్ చూసి తీరాల్సిందే. ఈ టిఫిన్ బాక్స్ ను చూసేందుకు వచ్చిన ఇద్దరు దీనిని దొంగిలించడం పెను సంచలనమే.
చోరీ ఎప్పుడు జరిగిందంటే..
నిజాం మ్యూజియంలో ఉన్న బంగారం, రజతంతో తయారైన టిఫిన్ బాక్స్ సెప్టెంబర్ 2, 2018న చోరీకి గురైంది. చోరీకి పాల్పడిన వారు మరికొన్ని వస్తువులను కూడా దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితులు మ్యూజియం భద్రతపై అధ్యయనం చేసి, పై నుంచి గోడలెక్కి లోపలికి చొచ్చుకెళ్లారు. 48 గంటలలోనే ఈ కేసును పోలీసులు ఛేదించి, చోరీకి గురైన విలువైన వస్తువులను రికవరీ చేశారు.
ఆ నిందితుడే ఇతను..
నిజాం మ్యూజియం లో టిఫిన్ బాక్సు చోరీ కేసు నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది. 2018లో నిజాం మ్యూజియంలో విలువైన వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్ బాక్స్ చోరీ కేసులో నిందితుడుగా ఉన్న గౌస్.. ఆ కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ నేరాలు కొనసాగించాడు. రాజేంద్ర నగర్ పరిధిలో 2023లో సవర్ ఖాన్ అనే వ్యక్తిని గౌస్ అత్యంత దారుణంగా హత్య చేశాడు.
Also Read: Tirumala Alert: పూజల పేరుతో కేటుగాడి మోసం.. తిరుమలలో జాగ్రత్త..
గౌస్ ను 2023లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించారు. తాజాగా సాక్ష్యాలు కోర్టు కు సమర్పించిన రాజేంద్ర నగర్ పోలీసులు.. అతను చేసిన నేరాలను కోర్టుకు వివరించారు. విచారణ జరిపిన న్యాయస్థానం నిందిడికి జీవితఖైదు విధించింది. అయితే ఈ నిందితుడికి ఓ వెరైటీ అలవాటు ఉంది. అదేమిటో తెలుసా.. అరెస్ట్ అయిన ప్రతిసారీ తన అరెస్ట్ వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇతని హాబీగా మార్చుకున్నాడు.