పహల్గాం దాడిపై అత్యవసర విచారణ జరపాలంటూ దాఖలైన పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అదే సమయంలో పిటిషనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. ఇలాంటి వ్యాజ్యాలతో సంచలనం సృష్టించేందుకు ప్రయత్నించ వద్దని హితవు పలికింది. ఇలాంటి పిల్ ద్వారా భారత భద్రతా బలగాల స్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పింది. పిటిషనర్ బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది సుప్రీంకోర్టు.
పిటిషనర్ వాదన ఏంటి..?
కాశ్మీర్ కు చెందిన మహ్మద్ జునైద్, ఫతేష్ సాహు, విక్కీ కుమార్ లు సుప్రీంకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వెంటనే జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని వారు కోరారు. కాశ్మీర్ కు వచ్చే టూరిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతపై కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాలకు తగిన మార్గదర్శకాలకు ఇవ్వాలని కూడా పిల్ లో కోరారు. జస్టిస్ సూర్యకాంత్, ఎన్ కోటేశ్వర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం ఈ మూడు పిల్ లను కలిపి విచారించింది. ఇతర రాష్ట్రాల్లోని కాశ్మీరీ విద్యార్థుల భద్రత కోసమే తాము ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు పిటిషనర్ లు తెలుపగా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల కోసమే అయితే హైకోర్టులకు వెళ్లొచ్చని తెలిపింది. ఇది చాలా క్లిష్ట సమయం అని, ఉగ్రవాదంపై జరిగే పోరులో ప్రతి పౌరుడు చేతులు కలపాలని సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసేటప్పుడు కాస్త బాధ్యతతో వ్యవహరించాలని, అందులో సున్నితత్వాన్ని అర్థం చేసుకోవాలని తెలిపింది. ఇలాంటి అంశాలను న్యాయ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించొద్దని, ఉగ్రవాద ఘటనల విచారణకు జడ్జీలు నిపుణులు కారని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పిటిషనర్లు తమ పిల్స్ ఉపసంహరించుకున్నారు.
పాక్ అష్టదిగ్బంధం..
పహల్గాం దాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పర్యాటకులపై పేలిన తూటాల కారణంగా 26మంది చనిపోయారు. వారి కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి. దేశవ్యాప్తంగా నిఘా వ్యవస్థను అప్రమత్తం చేయడంతోపాటు, పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి గట్టిగా బదులిస్తామని భారత్ స్పష్టంచేసింది. భారత్ లో తాత్కాలిక వీసాలతో ఉంటున్న పాకిస్తానీయుల్ని తిరిగి పంపించివేసింది. పాకిస్తాన్ తో వ్యాపార లావాదేవీల్ని కూడా పరిమితం చేసింది. పాక్ ని అష్టదిగ్బంధం చేసేందుకు నిర్ణయించింది. ఈ దశలో పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దుల్లో బాంబుల మోత మోగిస్తోంది. యుద్ధం వస్తే పాక్ ధీటుగా స్పందిస్తుంది అంటూ ఆ దేశ మంత్రులు మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు.
పహల్గాం ఉదంతంతో ప్రభుత్వం అన్ని కోణాల్లోనూ అప్రమత్తమవుతోంది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోడానికి సమాయత్తమైంది. సరిహద్దుల్లో ఉగ్రమూకల కదలికలపై నిఘా పెట్టింది. అక్రమంగా చొరబడేవారికి అవకాశం లేకుండా చేయబోతోంది. వివరాలు తెలియకుండా భారత్ లో నివాసం ఉంటున్న స్లీపర్ సెల్స్ పై కూడా ఫోకస్ పెంచారు పోలీసులు.