Tirumala Alert: బద్రీనాథ్ సినిమా అందరూ చూసే ఉంటారు. అందులో పూజల పేరుతో బ్రహ్మానందం చేసే మోసం అంతా ఇంతా కాదు. అలాగే ఇంద్ర సినిమాలో కూడా పూజల పేరుతో మోసం చేసిన దృశ్యాలు మనల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. అయితే అది రీల్ వరకు ఓకే. కానీ ఈ సినిమాలలోని పాత్రలను నిజ జీవితంలో తానే పోషించి, పూజల పేరుతో మహిళలను టార్గెట్ చేసి మోసం చేసిన మాయగాడి కథ ఇది. అది కూడా ఇతని మోసాలకు కేరాఫ్ అడ్రస్ ఎక్కడో అనుకుంటే పొరపాటే. సాక్షాత్తు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమల క్షేత్రం వద్దనే. అందుకేనేమో పాపం పండింది. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇప్పుడు కటకటాల పాలయ్యాడు.
పెద్ద మాయగాడు..
ఇతనొక పెద్ద మాయగాడు. అమాయక భక్తులను నమ్మించి మోసం చేయడమే ఇతని డ్యూటీ. పూజలు చేస్తానంటాడు.. మీ కాపురం చల్లగా ఉంటుందని నమ్మబలుకుతాడు. ఆ తర్వాత నగలు ఇవ్వమంటాడు. చిట్టచివరకు మన నోటి వెంట పోయాం మోసం అనిపిస్తాడు. ఇతనెవరో కాదు తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన మురుగన్ నాగరాజ్ అలియాస్ శంకర్రావు.
పూజల పేరుతో మోసం.. తమిళులే టార్గెట్
తమిళనాడుకు చెందిన మురుగన్ నాగరాజ్ తన టార్గెట్ గా తమిళ భక్తులను ఎంచుకుంటాడు. భాష వచ్చినందున వారిని బురిడీ కొట్టించడమే ఇతని పని. తిరుమలకు వచ్చే తమిళ భక్తులను టార్గెట్ చేసి, మురుగన్ చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. దీనితో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
వెలుగులోకి వచ్చిందిలా..
ఈ ఏడాది మార్చిలో తిరువన్నామలైకి చెందిన మహిళ అఖిలాండడం వద్ద ఉండగా ఆమె వద్దకు వెళ్లి తాను టీటీడీ ఉద్యోగునని మురుగన్ పరిచయం చేసుకున్నాడు. అలా పరిచయం చేసుకుని మాంగళ్య పూజ చేస్తే భర్తకు, కుటుంబానికి మేలు జరుగుతుందని నమ్మించాడు. అనంతరం శ్రీ బేడీ ఆంజనేయ స్వామి సమీపంలోని మినీ షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు తీసుకెళ్లి ఆమెకు రెండు డజన్ల మట్టి గాజులు ఇచ్చి ఆమె వద్దనున్న 40 గ్రాముల బంగారు మంగళసూత్రం, లక్ష్మీ డాలర్ ఉన్న హారం, రెండు ఫోన్లు తీసుకున్నారు.
తర్వాత పుష్కరిణికి వెళ్లి స్నానం చేసి గుడి ముందు మాంగల్య పూజకు రమ్మని చెప్పి అక్కడ నుండి పరారయ్యాడు. అదే నెలలో మరో ఇద్దరు మహిళలను ఇదే విధంగా మోసగించి వారి వద్ద నుంచి 90 గ్రాముల బంగారు ఆభరణాలను తీసుకొని పరిగెత్తాడు. ఇతనికి మరో టెక్నిక్ ఉందట. అదేమిటంటే ఏ భక్తుడు కనిపించినా, నీకు గండం ఉందంటూ మోసం చేయడం కూడా మనోడికి అలవాటే. ఇలా మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read: Smart Watch Tips: ఏంటి.. స్మార్ట్ వాచ్ పేలుతుందా? బీ అలర్ట్..
నేర చరిత్ర పెద్దదే
మురుగన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి. ఎస్సై చలపతి ఆధ్వర్యంలోనే ప్రత్యేక పోలీసులు చెన్నై, మధురై, పుదుచ్చేరిలో గాలింపు చర్యలు జరిపి అతన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ పంపించారు. ఇతని వద్ద నుంచి 13 లక్షల విలువైన 132 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నాగరాజు అలియాస్ మురుగన్ పై ఆంధ్ర, తమిళనాడులో 20కి పైగా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద పూజల పేరుతో మోసం చేసే కేటుగాళ్ల వలలో భక్తులు పడవద్దని పోలీసులు కోరుతున్నారు.