Mahabubabad: రెండేళ్ల పాటు ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు కులం పేరుతో ముఖం చాటేయడంతో ఓ దళిత యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపింది.
అసలేం జరిగింది?
మహబూబాబాద్ మండలం నడివాడకు చెందిన మునిగె సుస్మిత, అనిల్ అనే యువకుడు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అనిల్, గతంలో సుస్మిత గర్భం దాల్చగా అబార్షన్ కూడా చేయించాడు. అయితే, ఇటీవల పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. సుస్మిత దళిత యువతి కావడంతో తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదంటూ అనిల్ తప్పించుకు తిరగడం ప్రారంభించాడు.
‘మా అయ్య బీజేపీ సర్పంచ్.. ఏం చేసుకుంటావో చేసుకో’
తనకు న్యాయం చేయాలని.. పెళ్లి చేసుకోవాలని సుస్మిత నిలదీయడంతో అనిల్ అసలు రూపం బయటపడింది. ‘మా అయ్య బీజేపీ సర్పంచ్.. ఏం చేసుకుంటావో చేసుకో’ అంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుస్మిత, తన చావుకు అనిల్‌తో పాటు మరో పది మంది కారణమంటూ 21 పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది.
కుటుంబ సభ్యుల ఆందోళన.. పోలీసుల దర్యాప్తు
సుస్మిత మృతిపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనిల్, అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి సుస్మితను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ అండర్ బ్రిడ్జి వద్ద బంధువులు ధర్నాకు దిగారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు 21 పేజీల లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అనిల్ సహా 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Also Read: మద్యానికి డబ్బులివ్వలేదని భార్యను కర్రతో కొట్టి చంపిన భర్త.. కోహీర్‌లో దారుణం!