Sangareddy Crime: కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్న కట్టుకున్న భార్యపైనే ఓ భర్త కర్కశత్వం ప్రదర్శించాడు. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఆమె తలపై కర్రతో విచక్షణారహితంగా బాది ప్రాణాలు తీశాడు. సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కుటుంబ భారం మోస్తున్న భార్య
కోహీర్ పట్టణానికి చెందిన సురేష్‌కు, భాగ్యమ్మ(32) అనే మహిళతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, సురేష్ గత కొంతకాలంగా మద్యానికి పూర్తిగా బానిసై, ఏ పనీ చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. భర్త బాధ్యత మరిచిపోవడంతో కుటుంబ పోషణ భారమంతా భాగ్యమ్మపైనే పడింది. తన ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి ఆమె స్థానికంగా ఉన్న ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.
డబ్బుల కోసం గొడవ.. కర్రతో దాడి
నిత్యం మద్యం తాగడానికి, తన వ్యక్తిగత ఖర్చులకు డబ్బులు ఇవ్వాలంటూ సురేష్ భార్యతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే నవంబర్ 13న ఉదయం కూడా మద్యం కోసం డబ్బులు కావాలంటూ భాగ్యమ్మతో వాగ్వాదానికి దిగాడు. తాను కష్టపడి సంపాదించిన డబ్బును తాగుడుకు ఇవ్వడానికి భాగ్యమ్మ నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సురేష్, ఇంట్లో ఉన్న కర్రను తీసుకుని ఆమె తలపై బలంగా కొట్టాడు.
చికిత్స పొందుతూ మృతి.. నిందితుడు పరార్
ఈ దాడిలో తలకు తీవ్ర గాయాలై రక్తస్రావంతో కుప్పకూలిన భాగ్యమ్మను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. తల్లి మరణం, తండ్రి కర్కశత్వంతో ఇద్దరు కుమార్తెలు దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటన అనంతరం నిందితుడు సురేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: జనసేన లేకపోతే కూటమికి ఆ ఓట్లు కూడా వచ్చేవి కావు: బొత్స సత్యనారాయణ