Intermediate Board: ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఇంటర్మీడియట్ బోర్డు రద్దు కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేలా ఉందని మండిపడ్డారు. ఏ పథకాన్నైనా పాలసి నైనా ప్రవేశ పెట్టేపుడు విస్తృతమైన చర్చలు జరపాలని, పాలసి మార్చేపుడు జరిగే పర్య వసానాలపై అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో హిట్లర్ లా పాలసి లపై ఫత్వాలు జారీచేస్తున్నారని,కే బీ ఆర్ పార్కు చుట్టూ రోడ్డు విస్తరణ పనుల్లో కాంగ్రెస్ 300 కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేసినట్టే ఇంటర్ బోర్డు పై ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకున్నారని మండిపడ్డారు.
ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకార పూరిత నిర్ణయం అన్నారు. విద్యా శాఖ కు పూర్తి స్థాయి మంత్రి ఉండాలి కానీ నియమించలేదని.. విద్య వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో విద్యా శాఖకు 15 శాతం కేటాయిస్తామని 8 శాతం కూడా కేటాయించలేదని, ఉస్మానియా యూనివర్సిటీ కి వెయ్యి కోట్ల నిధుల హామీ జీవో లకే పరిమితమయ్యింది..యూనివర్సిటీ ల్లో నియామకాలు వంతుల వారీగా చేయడం ఉన్నత విద్యను భ్రష్టు పట్టించడమేఅన్నారు. గురుకుల టెండర్లలో వేల కోట్ల కుంభకోణం తో పాటు విద్యాశాఖ లో అనేక అవకతవకలు జరిగినపుడు ప్రభుత్వానికి కొనసాగే అర్హత ఉందా ? అని నిలదీశారు. మోడీ తెచ్చిన కొత్త విద్యా విధానాన్ని సోనియా వ్యతిరేకిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయాలనుకుంటున్నది? అని ప్రశ్నించారు.
ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేయడం తెలంగాణ స్థానికత కు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారని,..నీళ్ల లాగే విద్య ను కూడా కాంగ్రెస్ ఇతర రాష్ట్రాలకు దోచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. తొమ్మిదో తరగతి నుంచి నాలుగేళ్లు వరసగా ఎక్కడ చదివితే అక్కడ విద్యార్థులు స్థానికులవుతారు అని నీట్ లాంటి ఎంట్రన్స్ నిబంధనలు చెబుతున్నాయి. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ఇంటర్ బోర్డు రద్దు వ్యతిరేకం అన్నారు. పాలసి మార్చినపుడు న్యాయనిపుణుల సలహా తీసుకోవాలనే సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికిలేదా ? అని ప్రశ్నించారు. ఇంటర్ బోర్డు రద్దు పై వెంటనే అఖిల పక్ష సమావేశం నిర్వహించాలి..విద్యార్ధి సంఘాలతో వెంటనే ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు పై నిర్ణయాన్ని తొందరపడి అమలు చేస్తే బీ ఆర్ ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు.
Also read: జిగురు లేకుండా అచ్చం అమ్మమ్మ చేతి వంటలా బెండకాయ పులుసు.. వేడి వేడి అన్నంలోకి అదుర్స్!