Godavari Pushkaralu: ధర్మపురిలో గోదావరి పుష్కరాల పనులు ఇప్పుడు రాజకీయ విమర్శలకు వేదికగా మారాయి. 2027 పుష్కరాల కోసం ప్రభుత్వం సుమారు 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతోంది. అయితే.. కొత్త స్నాన ఘాట్లు నిర్మిస్తున్నామంటూ ప్రచారం చేస్తున్న ప్రభుత్వం.. వాస్తవంగా పాత ఘాట్లపైనే మళ్లీ పనులు చేస్తోందని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
2015 గోదావరి పుష్కరాల సమయంలో నిర్మించిన సోమవిహార్, మహాలక్ష్మి ఘాట్ల వద్ద ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. పాత మెట్లను తొలగించి.. అదే ప్లాట్‌ఫామ్‌పై కొత్త మెట్లు నిర్మిస్తున్నారు. దీంతో అసలు కొత్తగా నిర్మిస్తున్నదేంటి? పాత ప్లాట్‌ఫామ్‌పైనే మళ్లీ పనులు చేయడానికి కారణమేంటి? అంటూ ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాధనం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు.. నిధులు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేస్తున్నారు? పాత ఘాట్లకు కొత్త మెట్లు నిర్మించడం వల్ల భక్తులకు అదనంగా కలిగే ప్రయోజనాలేంటి? అన్న వివరాలు ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.
అటు స్థానికులు కూడా పుష్కరాల పనులపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న పనుల్లో పారదర్శకత ఉండాలని అంటున్నారు. మొత్తానికి.. 200 కోట్ల రూపాయలతో ధర్మపురిలో జరుగుతున్న పుష్కరాల అభివృద్ధి పనులు.. నిజమైన అభివృద్ధికి నిదర్శనమా? లేక పాత ఘాట్లకు కొత్త మెరుగులేనా? అన్న ప్రశ్నలు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం ఈ విమర్శలకు ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.
Also Read: ఇవి ఎలక్షన్స్ ఆ..? లేక సెలక్షన్స్ ఆ.. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్!