సీఎం రేవంత్ రెడ్డి పౌరుషంతో బతుకుతారని అన్నారు మంత్రి సీతక్క. ఆయన మాటలు పౌరుషంతో ఉంటాయని చెప్పారు. అయితే కేటీఆర్ విషయానికొస్తే ఆయనవన్నీ పొగరుబోతు మాటలని చెప్పారు. కేటీఆర్ కి దొర పొగరు ఉందని, ఆయన గలీజ్ గా మాట్లాడతారని మండిపడ్డారు. పౌరుషం, పొగరు రెండూ ఒకటి కావన్నారు సీతక్క.
రేవంత్ రెడ్డి పౌరుషంతో మాట్లాడితే కేటీఆర్ పొగరుతో మాట్లాడుతున్నాడు : మంత్రి సీతక్క
పౌరుషం, పొగరు రెండూ ఒకటి కాదు
మా సీఎం చెప్పినట్లు కేటీఆర్ విదేశాల్లో ఏవో కడిగినట్లే కనపడుతోంది
కక్ష సాధింపు అయితే ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజే వాళ్లను జైల్లో వేసే వాళ్లం
జైలుకు వెళ్లాలని… pic.twitter.com/5gDy0ETxwu
— BIG TV Breaking News (@bigtvtelugu) June 16, 2025
కక్షసాధింపా..?
కేటీఆర్ పై కేసుల్ని కక్షసాధింపు అనడం సరికాదన్నారు సీతక్క. ఒకవేళ కక్షసాధింపు అనుకుంటే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే వారిని జైల్లో వేసేవాళ్లం కదా అని ప్రశ్నించారు. జైలుకెళ్లాలని కేటీఆర్ కుతూహలంతో ఉన్నట్టు అనిపిస్తోందన్నారామె. కక్షసాధింపు అంటూ తమపై నిందలు వేయడం సరికాదన్నారు. తమ సీఎం చెబుతున్నట్టు కేటీఆర్ విదేశాల్లో ఏవో కడిగినట్లే కనపడుతోందని ఎద్దేవా చేశారు.
ఎంత రెచ్చగొట్టినా..
తమను, తమ ప్రభుత్వాన్ని ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనంతో మాట్లాడుతున్నామని చెప్పారు మంత్రి సీతక్క. సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ మాటలతో రెచ్చగొడుతున్నారని, ఆయన మాత్రం సంయమనం పాటిస్తున్నారని అన్నారు. చట్ట ప్రకారం జరగాల్సిందే జరుగుతుందన్నారామె.
చెల్లితో పంచాయితీ..
కేటీఆర్ కి చెల్లితో పంచాయితీ ఉందని, వారిద్దరి మధ్య గొడవలున్నాయని, ఆధిపత్య పోరు నడుస్తోందని చెప్పారు మంత్రి సీతక్క. జైలుకు వెళ్లి వస్తే ఏదో అయిపోవచ్చు అని కేటీఆర్ అనుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు. జైలుకి పోయిన చెల్లెలు, అక్కడ యోగా చేసిందని చెప్పుకున్నారని, కేటీఆర్ కూడా జైలుకెళ్లి యోగా చేసుకుంటా అంటున్నారని, ఆయనకు జైలు అంటే అంత ఇష్టం ఉన్నట్టుందన్నారు. కేటీఆర్ ది దొరలకున్న దురహంకారం అన్నారు సీతక్క. పల్లెల్లో ఎవరైనా ఎదిరిస్తే దొర దురహంకారంతో ప్రవర్తిస్తారని, కేటీఆర్ కూడా అలాగే ప్రవర్తిస్తున్నారని చెప్పారు.
జైలులో ప్లానింగ్..
జైలులో పొలిటికల్ ప్లాన్లు వేసుకోవాలని కేటీఆర్ అనుకుంటున్నారని, అందుకే ఆయన జైలుకెళ్లాలని ఉబలాట పడుతున్నట్టు కనపడుతోందని సెటైర్లు పేల్చారు సీతక్క. కవిత కూడా జైలులో ప్రణాళికలు వేసుకుని వచ్చిందని, జైలునుంచి వచ్చీ రాగానే బీసీలు, దళితులు, మహిళలపై ఆమె ప్రేమ ఒలకబోస్తోందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలు, దళితులగురించి ఆలోచించకుండా, ఇప్పుడు వారి పేరుతో కవిత రాజకీయం చేయాలనుకుంటున్నారని విమర్శించారు. ఇప్పుడు కేటీఆర్ కూడా జైలుకెళ్లి ప్రణాళికలు వేసుకోవాలనుకుంటున్నారని, సానుభూతి పొందాలనుకున్నారని ఎద్దేవా చేశారు.