Queen Alamelamma Curse: ఏం చేసినా ఫర్వాలేదు. కానీ, ఆడదాని ఉసురు తాకకూడదు అంటారు పెద్దలు. మైసూర్ కు చెందిన వడియార్ రాజవంశం కూడా నాలుగు శతాబ్దాలుగా ఓ మహిళ శాపాన్ని అనుభవిస్తుంది. కానీ, తాజా పరిణామాలు ఆ శాపం నుంచి విముక్తి కలిగినట్లు తెలియజేస్తున్నాయి. ఇంతకీ ఆ మహిళ శాపం ఏంటి? దాని వెనుక ఉన్న కథ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రాణి, ఆమె ఆభరణాలు
సుమారు 400 సంవత్సరాల క్రితం.. 1612లో, అలమేలమ్మ అనే రాణి ఉండేది. ఆమె మైసూర్ సమీపంలోని శ్రీరంగపట్నంలో ఉండేది. ఆమె భర్త తిరుమలరాజు. ఆయన అనారోగ్యానికి గురై కొద్ది రోజుల్లోనే చనిపోయాడు. అలమేలమ్మ దగ్గర కొన్ని అందమైన ఆభరణాలు ఉన్నాయి. వాటిలో ఒక ప్రత్యేకమైన ముత్యపు ముక్కుపుడక ఉంది. ఆమెకు ఈ ఆభరణాలు అంటే ఎంతో ఇష్టం. వాటిని జాగ్రత్తగా దాచిపెట్టుకుంది. కానీ, ఈ విషయం రాజ వడియార్ అనే రాజుకు తెలిసింది. ఆ ఆభరణాలను తీసుకురమ్మని అలమేలమ్మ దగ్గరికి తన మనుషులను పంపించాడు. ఆమె వారికి ముక్కుపుడకను ఇచ్చింది. మిగిలిన ఆభరణాలను తీసుకుని తలకాడు అనే పట్టణానికి పారిపోయింది. రాజు మనుషులు ఆమెను వెంబడించారు. కావేరి నది ఒడ్డున ఉన్న మలంగి అనే ప్రదేశానికి చేరుకుంది. తన ఆభరణాలను కాపాడుకోవడానికి, ఆమె నదిలోకి దూకింది. కానీ, ఆమె ప్రాణాలు కోల్పోయింది. చనిపోయే ముందు ఆమె మూడు శాపాలు పెట్టింది. వాటిలో 1. తలకాడు ఇసుకతో కప్పబడి పోతుంది. 2. మలంగి సుడిగుండంగా మారిపోతుంది. 3. మైసూర్ రాజులకు పిల్లలు పుట్టకూడదని శపించింది.
ఆ తర్వాత ఏం జరిగింది?
అలమేలమ్మ చెప్పినట్లుగానే ఒకప్పుడు పచ్చగా ఉన్న తలకాడు ఇప్పుడు ఎడారిగా మారి ఇసుకతో కప్పబడి ఉంది. పాత దేవాలయాలు ఇసుకలో మునిగిపోయాయి. మలంగి దగ్గర నదిలో వస్తువులను కిందికి లాగే ప్రమాదకరమైన నీటి సుడిగుండాలు ఉన్నాయి. చాలా సంవత్సరాలుగా, వడియార్ రాజులకు పిల్లలు లేరు. ఒక రాజుకు సంతానం లేనప్పుడు, వారు ఒక అబ్బాయిని దత్తత తెచ్చుకుని రాజుగా చేసుకునేవారు. అయితే, అలమేలమ్మకు అన్యాయానికి వడియార్లు బాధపడ్డారు. వారు మైసూర్ ప్యాలెస్‌లో ఆమె బంగారు విగ్రహాన్ని తయారు నెలకొల్పారు. తప్పును క్షమించాలని కోరారు. ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా, వారు ఆమె కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
Read Also: రైలు కిందకు దూసుకెళ్లిన టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారు.. తప్పు నాది కాదు, కారుదే అంటోన్న డ్రైవర్!
శాపం సుఖాంతం అయ్యిందా?
2015లో యదువీర్ వడియార్లకు నాయకుడయ్యాడు. 2016లో త్రిషిక అనే యువరాణిని వివాహం చేసుకున్నాడు. 2017లో ఆద్యవీర్ అనే మగబిడ్డ పుట్టాడు. తరువాత మరొక కొడుకు పుట్టాడు. దీంతో శాపం తొలిగిపోయినట్లు భావిస్తున్నారు. అలమేలమ్మ బంగారు విగ్రహాన్ని పూజించడంతో ఆమె మనసు కరిగిపోయినట్లు భావిస్తారు. అందుకే, తమ వంశానికి ఉన్న శాపం విరుగుడు జరిగినట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: 2 గంటల పాటు రైలును ఆపేసిన ప్రయాణీకులు.. ఎక్కనే ఎక్కమంటూ ఇంజిన్ ముందు హంగామా!