KTR Vs Harish Rao :బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారిద్దరూ కీలక మంత్రులు. ఒకరు సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ . ఆయన ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. మరొకరు గులాబీ బాస్ మేనల్లడు హరీశ్ రావు ఆర్ధిక, వైద్య, ఆరోగ్యశాఖల బాధ్యతలు మోస్తున్నారు. ఇద్దరూ ఇద్దరే. పాలనా వ్యవహారాల్లో తమదైన శైలి ప్రదర్శిస్తూ నాయకులుగా తమదైన ముద్రవేశారు. ఇద్దరికీ పార్టీలో మంచి పట్టుంది.
కేటీఆర్ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రిగా తనదైన ముద్రవేశారు. రాష్ట్రానికి అనేక కంపెనీలు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. హైదరాబాద్ లో ఐటీ సహా పరిశ్రమల విస్తరణకు తన వంతు కృషి చేస్తున్నారు. పెట్టుబడుల ఆకర్షణలో తన మార్కును చూపిస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా తెలంగాణలోని అర్బన్ ప్రాంతాల్లోనూ పట్టుసాధించారు.
హరీశ్ రావు ఆర్థికశాఖ , వైద్య, ఆరోగ్య శాఖలను నిర్వహిస్తూ తనదైన మార్కు చూపిస్తున్నారు. రాజకీయ నేతగా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో హరీశ్ కు చాలా పట్టుంది. ఇప్పుడు తెలంగాణలో స్థిరపడిన సెటిలర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడే ఓటు హక్కు నమోదు చేసుకోండి అని వారిని కోరుతున్నారు.
నిత్యం తెలంగాణలోని ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తూ బిజీబిజీగా ఉండే ఆ ఇద్దరు మంత్రులు.. ప్రస్తుతం విదేశీ పర్యటనల్లో ఉన్నారు. హరీశ్ రావు అమెరికా వెళ్లారు. కేటీఆర్ లండన్ లో టూర్ లో ఉన్నారు. అయితే మంత్రుల విదేశీ టూర్లపై అధికార బీఆర్ఎస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని టాక్ నడుస్తోంది. ఇటీవల హుస్నాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటించిన సమయంలో జిల్లా మంత్రిగా ఉన్న హరీశ్ రావుకు.. కేటీఆర్ టూర్ పై సమాచారం ఇవ్వలేదనే వార్తలు వచ్చాయి. అందుకే ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని గులాబీ కేడర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. తన పర్యటనపై ఎందుకు హరీశ్ రావు కు సమాచారం ఇవ్వలేదు. అసలే కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అవుతారని ఎప్పటి నుంచో పార్టీలో చర్చ నడుస్తోంది. నిజంగానే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందా..? ఈ గ్యాప్ బీఆర్ఎస్ లో చీలిక తెస్తుందా..? ఈ విషయం కేసీఆర్ దృష్టికి వెళ్లిందా..? మరి గులాబీ బాస్ కొడుకు, మేనల్లుడి మధ్య సయోధ్య కుదురుస్తారా..?