తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితిపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా, ఉత్పత్తి గురించి తెలియాలనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగం పురోగతికి విద్యుత్ సరఫరానే వెన్నెముక అని భట్టి పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వివరించారు. డిస్కంల ద్వారా వచ్చిన నష్టాలు రూ.62,461 కోట్లు అని ప్రకటించారు. 2023 అక్టోబర్ 31 నాటికి రూ.81,516 కోట్లు అప్పులు తెచ్చారని వెల్లడించారు.
ప్రభుత్వం వెల్లడించిన లెక్కలపై గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్ రెడ్డి స్పందించారు. తమ ప్రభుత్వ హయాంలో అప్పులు తెచ్చి ఆస్తులు పెంచామని స్పష్టంచేశారు. వ్యవస్థలను బలోపేతం చేశామన్నారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ ఈ విషయం చెప్పిందన్నారు. గతంలో ట్రాన్స్ మిషన్ వ్యవస్థ సరిగా ఉండేది కాదన్నారు. కానీ బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేశామన్నారు.
2014 ముందు తెలంగాణ ప్రజలు విద్యుత్ వాడనట్లు జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. కరెంట్ ను బీఆర్ఎస్ నేతలే కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారని సెటర్లు వేశారు.
.