పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని, ఉప ఎన్నికలు పెట్టాలని తెగ హడావిడి చేస్తున్నారు కేటీఆర్. ఇప్పుడు అనివార్యంగా వచ్చిన ఉప ఎన్నికల్లో మాత్రం చేతులెత్తేశారు. రేపు ఆ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అందులోనూ అధికార కాంగ్రెస్ సపోర్ట్ తో బరిలో దిగే ఆ 10మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఓడించగలదా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జరిగినట్టే బీఆర్ఎస్ కి షాక్ తగిలితే దాని ప్రభావం 2028 ఎన్నికలపై పడదా? ఊహించుకుంటేనే ఇప్పుడు ఆ పార్టీ వణికిపోతోంది.
గతం మరచిపోతే ఎలా?
2014లో తెలంగాణలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పక్క పార్టీలనుంచి వలసలను ఓ రేంజ్ లో ప్రోత్సహించింది. దాదాపుగా చాలామందిని భయపెట్టి మరీ పార్టీలో చేర్చుకుంది. అలా బీఆర్ఎస్ ప్రోద్బలంతోనే టీడీపీ టికెట్ పై గెలిచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆనాడు బీఆర్ఎస్ లో చేరారు. 2018, 2023లో కూడా ఆయన బీఆర్ఎస్ బలంతో కాకుండా తన సొంత బలంగంతో గెలిచారు. ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో అసలు జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ బలమేంటో తేలిపోయింది. అప్పుడు పార్టీ ఫిరాయింపులపై నోరు మెదపని బీఆర్ఎస్ కీలక నేతలు 2023 ఎన్నికల తర్వాత కొంతమంది తమ పార్టీనుంచి కాంగ్రెస్ వైపు ఆకర్షితులైతే మాత్రం గగ్గోలు పెట్టారు.
ఆ 10మందిపై అనర్హత?
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్‌కుమార్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి.. వీరంతా వివిధ సందర్భాల్లో బీఆర్ఎస్ కి దూరమై, కాంగ్రెస్ కి దగ్గరయ్యారు. అసలే ఓటమి బాధతో ఉన్న బీఆర్ఎస్ కి ఎమ్మెల్యేలు చేజారడం నచ్చలేదు. దీంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి నీతి, నిజాయితీలు గుర్తొచ్చాయి. వెంటనే ఆ 10మందిపై స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. కానీ స్పీకర్ పెద్దగా రియాక్ట్ కాలేదు. దీంతో వారు ముందు హైకోర్ట్ ని ఆశ్రయించి, ఆ తర్వాత సుప్రీంకోర్ట్ తలుపు తట్టారు.
ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే.. తాజాగా కలకత్తా కోర్టు ఓ సంచలన తీర్పునిచ్చింది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముకుల్ రాయ్ బీజేపీ తరపున గెలిచారు. ఆ తర్వాత అధికార టీఎంసీలోకి ఫిరాయించారు. ఆయనపై బీజేపీ స్పీకర్ కి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో బీజేపీ నేతలు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు తాజాగా ముకుల్ రాయ్ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ కీలక తీర్పునిచ్చింది. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమవుతోంది.
తెలంగాణ సంగతేంటి?
తెలంగాణలో కూడా ఆ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు రావాలని బీఆర్ఎస్ బలంగా కోరుకుంటోంది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత కేటీఆర్ డీలా పడ్డట్టు స్పష్టంగా తెలుస్తోంది. మీడియా ముందుకొచ్చిన ఆయన ఆ 10 స్థానాల ఉప ఎన్నికలపై కూడా స్పందించారు. ఒక్క ఉప ఎన్నిక గెలిచేందుకే కాంగ్రెస్ ఆపసోపాలు పడిందని, ఆ 10 స్థానాలకు ఎన్నికలు వస్తే రాహుల్ గాంధీ కూడా ప్రచారానికి వస్తారని సెటైర్లు పేల్చారు కేటీఆర్. కానీ వాస్తవానికి ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలను ఎదుర్కునే ధైర్యం బీఆర్ఎస్ కి కూడా లేదు. అయితే లేనిపోని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఆయన కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారు.
LIVE: BRS Working President @KTRBRS addressing the media at Telangana Bhavan https://t.co/Rnd7KCSuLL
— BRS Party (@BRSparty) November 14, 2025
Also Read: జూబ్లీ హిల్స్ గుణపాఠం.. కేటీఆర్ ఇకనైనా గ్రౌండ్ రియాల్టీ అర్థం చేసుకుంటారా?
Also Read: రేవంత్ నాయకత్వానికి ఢోకా లేనట్టే