CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో డైనమిక్ లీడర్. ఆయన ఓ సంచలనం. యువతరానికి అతను ఓ రోల్ మోడల్. రాబోయే యువ నాయకులకు మార్గదర్శకం. సమస్యలకు, ఆటుపోట్లకు అదరలేదు. బెదరలేదు. వైఫల్యాలకు కుంగిపోలేదు. వెన్నుచూపని వీరత్వంతో అపజయాలనే అనుభవాలుగా మార్చుకున్నారు. పోరాటాలనే వారధిగా చేసుకొని అతి తక్కువ సమయంలోనే అశేష జనాదరణ పొందాడు. ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చి.. ZPTCగా ప్రస్తానం ప్రారంభించి.. 15 ఏళ్లలోనే రాష్ట్రాన్ని నడిపించే అధినాయకుడు అయ్యారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తూ.. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ.. ఆపద్భాందవుడు అవుతున్నారు.
⦿ సరిగ్గా రెండేళ్లు…
మాటల తూటాలతో ప్రత్యర్థులకు పట్టపగలే చుక్కలు చూపించే ధీరత్వం ఆయనది. ప్రసంగాలతో మంత్రముగ్ధుల్ని చేసి యువతను ఉర్రూతలూగించగలిగే నాయకత్వం ఆయన సొంతం. ఇచ్చిన మాటకు కట్టుబడి.. హామీలను అమలు చేసే గొప్పవ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. అలుపెరగని పోరాటంతో చాలా తక్కువ సమయంలోనే ప్రజలకు దగ్గరై.. అగ్రనేతగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యారు. రేపటికి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా రెండేళ్లు..
⦿ ఒక్క రోజు సెలవు తీసుకోని సీఎం..
ఈ రెండేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో అభివృద్ధి పనులకు స్వీకారం చుట్టారు. గొప్ప గొప్ప పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో సంక్షేమ కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తోంది. రెండేళ్లలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరం పని చేసిన ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల నుంచి మన్ననలను పొందుతున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందేలా పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
⦿ గొప్ప సంక్షేమ పథకాలు..
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా గొప్ప గొప్ప సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించే మహాలక్ష్మి పథకం, పేదలకు సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలు అత్యంత వేగంగా అమలయ్యాయి. గత ప్రభుత్వ హామీలకు భిన్నంగా.. లక్షల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ కొనసాగిస్తూ రైతు భరోసా కింద వేల కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు.
⦿ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా పోటీ పరీక్షలు..
సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లడంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం వేగం చూపింది. పోటీ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా గ్రూప్-1, 2, 3 పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి.. ఇప్పటికే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశారు. రాబోయే ఆరు నెలల్లో మరో 40 వేల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
⦿ ప్రాజెక్టుల విషయంలో కీలక నిర్ణయాలు..
ప్రాజెక్టుల విషయంలో కూడా ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్ఎల్బీసీ (SLBC) పనులు రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి, వాటిని సమీక్షించారు. హైదరాబాద్ నగరానికి దీటుగా వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కాలేజీ నిర్మాణాలతో పాటు పలు రోడ్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తున్నారు.గత ప్రభుత్వాల నిర్మాణ లోపాలు, అవినీతి ఆరోపణలు ఉన్న ప్రాజెక్టులపై దృష్టి పెట్టి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులు, నీటిపారుదల వ్యవస్థలను బలోపేతం చేయాలని కృషి చేస్తున్నారు.
⦿ పేద ప్రజల ఆపద్భాందవుడు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమాలకు రెండు కళ్లుగా భావించి ముందుకు వెళుతుంది. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన నిబద్ధత, అలుపెరగని కృషి రాష్ట్రాన్ని కొత్త మార్గంలోకి నడిపిస్తూ.. పేద ప్రజలకు ఆపద్బాంధవుడిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
ALSO READ: KCR: పంచాయతీ ఎన్నికలు.. కేసీఆర్ ఆన్ యాక్షన్