Hyderabad : అతనో టౌన్ ప్లానింగ్ అధికారి. బిల్డింగులకు పర్మిషన్లు ఇచ్చే హోదాలో ఉన్నారు. ఇది చాలదా దండిగా దండుకోవడానికి. అదే పని చేస్తున్నాడు ఆ ఆఫీసర్. ఎడాపెడా లంచాలు దోచేస్తున్నాడు. గతంలోనూ ఇతనిపై ఆరోపణలు వచ్చాయి. కోర్టు కేసులు కూడా ఉన్నాయి. ఒక కేసులో ఏకంగా ఓ కార్పొరేటర్‌కే లంచం ఇస్తూ ఏసీడీకి దొరికిపోయిన చరిత్ర అతనిది. లేటెస్ట్‌గా ఆ అధికారిపై ఈడీ కన్ను పడింది. గురువారం ఏకకాలంలో ముంబై, హైదరాబాద్‌లో దాడులు చేసింది. దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్‌లో నగదు, బంగారం దొరికింది అతని ఇంట్లో.
13 చోట్ల ఈడీ దాడులు
వైఎస్ రెడ్డి. మహారాష్ట్రలోని వాసాయి-విరార్ మున్సిపల్ కార్పొరేషన్‌లో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్‌గా చేస్తున్నారు. 41 భవనాలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనేది అతనిపై వచ్చిన ఆరోపణ. 2009 నుంచి బిల్డర్స్‌తో కుమ్మక్కై అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చారని గుర్తించారు. ఆ స్కామ్‌లో భారీగా మనీ లాండరింగ్ జరిగిందనే కేసులో.. ముంబై, హైదరాబాద్‌లో ఏకకాలంలో 13 చోట్ల ఈడీ దాడులు చేసింది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని వైఎస్ రెడ్డి ఇంట్లో కూడా ఈడీ సోదాలు చేసింది. తనిఖీల్లో భారీ మొత్తంలో క్యాష్, గోల్డ్, డైమండ్ జువెలరీ దొరికింది.
నోట్ల కట్టలు.. నగలు..
వైఎస్ రెడ్డి ఇంట్లో ఏకంగా రూ.9 కోట్ల నగదు ఉంది. కట్టలకు కట్టలు నోట్లును నీట్‌గా సర్ది దాచారు. రూ.23 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు లభించాయి. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 32 కోట్లకుపైగా ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆ నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లు, గోల్డ్ ఆభరణాలు చూసి ఈడీ అధికారులే షాక్ అయ్యారని అంటున్నారు.
Also Read : టర్కీ టవళ్ల చరిత్ర ఏంటి? నెక్ట్స్ ఏంటి?
గతంలో కార్పొరేటర్‌కు లంచం..
వైఎస్ రెడ్డిపై గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. 2016లో తనపై ఉన్న కోర్టు కేసులను విత్‌డ్రా చేసుకునేందుకు అప్పటి శివసేన కార్పొరేటర్ ధనుంజయ గాన్డేకు రూ. 25 లక్షలు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారు వైఎస్ రెడ్డి. ఆ సమయంలో ఆయన్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. లేటెస్ట్‌గా మరో భారీ స్కాంలో వైఎస్ రెడ్డి ఆస్తులపై ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి.