టర్కీ యాపిల్స్, టర్కీ మార్బుల్స్, టర్కీ టూరిజం అంటూ ఇటీవల మనం చాలా విషయాల గురించి తెలుసుకున్నాం. వీటన్నిటికంటే మనకు బాగా పరిచయం ఉన్న పేరు టర్కీ టవళ్లు. తెలుగు రాష్ట్రాల్లో కూడా మారుమూల పల్లెటూళ్లలో కూడా టర్కీ అనే దేశం పేరు తెలియకపోయినా టర్కీ టవల్ అంటే తెలియనివారుండరు. అంతలా మన సంస్కృతిలో భాగంగా మారిపోయాయి టర్కీ రుమాళ్లు, టవళ్లు. అయితే టర్కీ చేసిన తప్పుడు పనికి ఆ దేశ వస్తువుల్ని భారత వ్యాపారులు బాయ్ కాట్ చేశారు. దీంతో టర్కీ టవళ్ల దిగుమతులు కూడా ఆగిపోయే పరిస్థితి. అంటే ఇకపై భారత్ లో టర్కీ టవళ్ల వ్యాపారం జరిగబోదనమాట.
సాధారణంగా ఇళ్లలో కాటన్ టవల్స్ వాడుతుంటారు. కానీ కొంతమంది తమ హోదాకు చిహ్నంగా టర్కీ టవళ్లను భుజాన వేసుకుని తిరుగుతుంటారు. ఇళ్లలోనే కాదు, బ్యూటీ పార్లర్ లు, స్పాలు, హెయిర్ సెలూన్లు, హోటళ్లలో కూడా టర్కీ టవల్స్ హోదాకి సింబల్ అనే చెప్పాలి. క్వాలిటీతోపాటు వాటి రేటు కూడా ఎక్కువే. అందుకే వాటిపై చాలామంది మోజు పడుతుంటారు.
టర్కీ టవళ్ల ప్రత్యేక ఏంటి..?
టర్కీ దేశంలో తయారైన టర్కిష్ టవల్స్ ని పెష్టెమల్, ఫౌటా, హమ్మామ్ టవళ్లు అని కూడా పిలుస్తారు. వాస్తవానికి భారత దేశం వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు. పురాతన కాలం నుంచి మన దేశంలో తయారయ్యే మేలురకం వస్త్రాలు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేవి. కానీ టవళ్ల విషయంలో మనం కూడా టర్కీని ఆదరిస్తున్నాం. టర్కీ టవళ్లను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ టవళ్లను టర్కీలో మాత్రమే టర్కిష్ కాటన్ ద్వారా తయారు చేస్తారు. ఈ టర్కిష్ కాటన్ ని ఏజియన్ అనే ప్రాంతంలో పండిస్తారు. ఈ పత్తి చాలా మృదువైనది. పైగా ప్రతి ఉతుకు తర్వాత మరింత మృదువుగా మారుతుంది. సాధారణ తువాళ్లు నాలుగైదు ఉతుకుల తర్వాత కాస్త గరుకుగా, హార్డ్ గా మారతాయి. కానీ టర్కీ టవళ్లు చాలాకాలం సాఫ్ట్ గా ఉంటాయి.
పర్యవరణ హితమైనవి..
మన్నిక విషయంలోనే కాదు, వాటి వాడకం కూడా సులభంగానే ఉంటుంది. సైజ్ పెద్దదిగా ఉన్నా బరువు తక్కువగానే ఉంటాయి. త్వరగా ఆరిపోతాయి, మురికిని, తడిని బాగా పీల్చుకుంటాయి. అందుకే పెద్ద పెద్ద హోటళ్లలో కస్టమర్ల సౌకర్యం కోసం వీటినే ఉపయోగిస్తుంటారు. టర్కీ టవళ్ల తయారీలో పెద్దగా రసాయనాల వినియోగం ఉండదు, ఇవి పర్యావరణ హితమైనవి, త్వరగా ఆరిపోతాయి. సాధారణ కాటన్ టవల్స్ లాగా వీటిని పదే పదే ఉతకాల్సిన అవసరం ఉండదు.
మల్టీ పర్పస్ వస్త్రాలు
టర్కీ కాటన్ తో తయారైన టవళ్లను కొన్నిసార్లు టేబుల్ క్లాత్ గా ఉపయోగించవచ్చు, మరికొన్ని సార్లు పిక్నిక్ స్పాట్ లో కింద పరచుకోడానికి వాడుకోవచ్చు. ఇలా వీటిని చాలా రకాలు గా ఉపయోగించే అవకాశం ఉంది. అందుకే మల్టీ పర్పస్ టవల్స్ ని చాలామంది ఇష్టపడుతుంటారు. భారత దేశం టర్కీ టవళ్లను భారీగా దిగుమతి చేసుకుంటుంది. గతేడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 1.8 బిలియన్ డాలర్ల టర్కీ టవళ్లు, వస్త్రాలను భారత్ దిగుమతి చేసుకుంది. ఇక ఆన్ లైన్ పోర్టళ్లలో కూడా టర్కీ టవల్స్ వ్యాపారం భారీగానే జరుగుతోంది.
భారత్ లో కూడా తయారీ..
పేరుకి టర్కీ టవల్స్ అయినా.. మన దేశంలో కూడా కొన్నిచోట్ల వాటిని తయారు చేస్తుంటారు. తమిళనాడులోని కరూర్, మహారాష్ట్రలోని సోలాపూర్, హర్యానాలోని పానిపట్ వంటి ప్రాంతాల్లో టర్కీ టవళ్ల ఉత్పత్తి జరుగుతోంది. దేశవాళీ పత్తితోపాటు.. టర్కీనుంచి దిగుమతి చేసుకున్న పత్తిని కూడా వీటి తయారీల్లో ఉపయోగిస్తుంటారు. మొత్తమ్మీద భారత్-పాక్ యుద్ధం కారణంగా టర్కీ టవళ్ల వ్యవహారం మరోసారి వార్తల్లోకెక్కింది. టర్కీ నుంచి టవళ్లు కూడా ఇక దిగుమతి చేసుకోవడం కష్టం. టర్కీ టవళ్లను ఇష్టపడేవారు ఇక లోకల్ టవళ్లతో సరిపెట్టుకోవాల్సిందే.