Rythu Bandhu : బీఆర్ఎస్ నాయకులు అనుకున్నదొకటి.. అయినదొకటి. రైతుబంధు విషయంలో కాంగ్రెస్‌ను దారుణంగా కార్నర్ చేయొచ్చని భావించారు. ఓ ప్లాన్ రెడీ చేసుకుని తొలి అడుగు వేశారు కూడా. అయితే అటువైపు నుంచి ఊహించని విధంగా రియాక్షన్ రావడంతో గులాబీ నాయకులు షాక్ తిన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కంగారు మామూలుగా లేదు.
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. రైతుబంధు అమలుకు వ్యవసాయ శాఖ ఈసీ అనుమతి కోరింది. ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వదనే ఉద్దేశంతో లేఖ రాసినట్లు ప్రచారం. ఎలాగూ ఈసీ అనుమతి నిరాకరిస్తుందని.. ఇదంతా కాంగ్రెస్ కుట్రగా ప్రజల్లో ప్రచారం చేసుకోవచ్చని స్కెచ్ వేశారు. కానీ.. ఎన్నికల సంఘం నుంచి ఊహించని రిప్లై వచ్చింది. ఏ తేదీ నుంచి రైతుల ఖాతాలో నగదు జమ చేస్తారో చెప్తే పరిశీలిస్తామని ఈసీ రిప్లై ఇచ్చింది. దీంతో అధికార పార్టీ నాయకులు ఖంగుతిన్నారు.
ఎన్నికల సంఘం నిర్ణయంపై అధికారపార్టీ నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇప్పుడేం చేయాలో వారికి పాలుపోవడం లేదు. రైతుబంధు నిధులు జమ చేసేందుకు ఖజానా నిండుకుంది. నిధుల కొరత ఉండటంతో సమాధానం దాటవేస్తూ మరో లేఖ రాసినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎరక్కపోయి ఇరుక్కుపోయామని అధికార పార్టీ నాయకులు తల పట్టుకుంటున్నారు.