Ellampet Municipal Office: స్వేచ్ఛ బ్యూరో : మున్సిపల్ అభివృద్ధి చేస్తున్నామని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకునే ఎల్లంపేట్ మున్సిపల్ పాలకుల పనితీరు వారి కార్యాలయం ముందే బట్టబయలవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లోనే వరుస సమస్యలు తిష్టవేయడంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వాటిపై అధికారులు దృష్టి పెట్టండి..
మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. భద్రత, పర్యవేక్షణ కోసం లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన కెమెరాలు మూగబోయినా వాటి మరమ్మతులపై అధికారులు దృష్టి సారించలేదని విమర్శిస్తున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలు, అధికారులు, సిబ్బంది రాకపోకలు జరిగే ప్రాంతంలోనే నిఘా వ్యవస్థ నిర్వీర్యమై ఉండడం పలు అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం..
ఒకవైపు సీసీ కెమెరాలు పనిచేయకపోతే, మరోవైపు పగటి పూట కూడా మున్సిపల్ కార్యాలయం ముందున్న వీధి దీపాలు వెలుగుతుండటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ను ఆదా చేయాలని ప్రజలకు సూచనలు చేసే అధికారులే ప్రభుత్వ ధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఆటోమేటిక్ టైమర్లు పనిచేయడం లేదా? లేక నిర్వహణ పూర్తిగా గాలికొదిలేశారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, మున్సిపల్ కార్యాలయం వెళ్ళే ప్రధాన రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. వర్షం పడితే గుంతల్లో నీరు నిలిచి రహదారి పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు.
అధికారులను ప్రశ్నించిన గ్రామస్తులు..
ద్విచక్రవాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని, పాదచారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని రోడ్లు, పారిశుధ్యం, విద్యుత్ దీపాలు, భద్రత వంటి అంశాలపై పర్యవేక్షణ చేయాల్సిన మున్సిపల్ కార్యాలయం ముందే ఇలాంటి పరిస్థితులు ఉండటం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని ప్రజలు అంటున్నారు. కార్యాలయం ముందే సమస్యలను పరిష్కరించలేని అధికారులు పట్టణంలోని ఇతర ప్రాంతాల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? అని ప్రశ్నిస్తున్నారు.
Also Read: కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!
సమస్యలను విస్మరిస్తే ఊరుకునే ది లేరు..
స్థానికులు వెంటనే మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు స్పందించి పనిచేయని సీసీ కెమెరాలను మరమ్మతు చేయాలని, పగటి పూట వెలిగే వీధి దీపాలను నిలిపివేసి విద్యుత్ వృథాను అరికట్టాలని, కార్యాలయం ముందున్న గుంతల రహదారిని అత్యవసరంగా మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలను విస్మరిస్తే ప్రజల ఆందోళన మరింత ఉధృతమయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
సమస్యలు పరిష్కరించండి మహాప్రభో
ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలో పాలన సక్రమంగా సాగడం లేదని గ్రామస్తుడు జనగాం నాగరాజ్ గౌడ్ ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో చిన్నచిన్న పనుల కోసం కూడా పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మున్సిపల్ కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపించారు.
అధికారుల పనితీరుపై విమర్శలు..
కార్యాలయం ముందే పనిచేయని సీసీ కెమెరాలు, పగటి పూట కూడా వెలుగుతున్న వీధి దీపాలు, అధ్వానంగా మారిన రహదారి పరిస్థితి అధికారుల పనితీరుకు అద్దం పడుతోందని విమర్శించారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంలో చూపుతున్న చొరవ, మౌలిక వసతుల కల్పనలో కనిపించడం లేదని నాగరాజు అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మున్సిపల్ పాలనలో నెలకొన్న సమస్యలను పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!