Hyderabad: ఎల్‌నినో కారణంగా ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ నగరానికి నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. గడిచిన నెల రోజులుగా అధికారులు నగరవాసులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. మరోవైపు సిటీకి నీటి కొరత రాకుండా చర్యలు చేపట్టారు. అంతా అనుకున్నట్లు జరిగితే నవంబర్ 15న గోదావరి జలాలు భాగ్యనగరానికి రానున్నాయి.
ఎల్‌నినో ప్రభావం తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపింది. సకాలంలో వర్షాలు పడకపోవడంతో పంటలు లేవు. చివరకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. నీటి కొరతపై అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో తాగు నీటి కష్టాలకు చెక్ చెప్పేలా అడుగులు వేస్తోంది జలమండలి.
గోదావరి జలాలను నగరానికి వేగంగా తీసుకొచ్చేందుకు చర్యలు వేగవంతం చేసింది. సోమవారం గోదావరి పైపులైను ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు జలమండలి ఎంపీ అశోక్ రెడ్డి. పైప్‌లైన్ నిర్మాణం, టన్నెల్ తవ్వకం, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనుల పురోగతిని అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. దిగువ స్థాయిలో జరుగుతున్న పనులు, పెండింగ్‌లో ఉన్నవి, నిర్దేశించిన మైలురాళ్లు, అవసరమైన వ్యవధిపై అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం ఘన్‌పూర్ వద్ద జరుగుతున్న పైప్ లైన్ అనుసంధాన పనులను నవంబర్ 15లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు జలమండలి ఎండీ. రోజుకు 40 ఎంజీడీల నీటిని హైదరాబాద్ నగరానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ప్రాంతంలో అధికారులు రాత్రింబవళ్లు పనులు కొనసాగిస్తున్నారు. గోదావరి ఫేజ్-2, 3 కింద మల్లన్నసాగర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలించనున్నారు. అందులో అధిక భాగం నగర అవసరాలు, మిగిలిన నీరు జంట జలాశయాలు, మూసీ పునరుద్ధరణకు వినియోగించనున్నారు.
ALSO READ: ఓంకారేశ్వర ఆలయానికి రూ. 1,108 కోట్లా.. జీవో 928ని రద్దు చేయాలన్న FGG!