India Destination of the Year 2027: భారత పర్యాటక రంగానికి 2027 సంవత్సరం ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే ప్రముఖ ట్రావెల్ మ్యాగజైన్ ‘ట్రావెల్ + లీజర్’ భారత్ ను ‘డెస్టినేషన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేసింది. దేశంలోని ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, సంస్కృతి, ఆహారపు అలవాట్లు, వన్యప్రాణులను బేస్ చేసుకుని ఈ గుర్తింపును అందించింది. బీచ్‌ల నుంచి మంచుకొండల వరకు, రాజభవనాల నుంచి పురాతన దేవాలయాల వరకు భారత్‌లో చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో 10 అద్భుతమైన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్వచ్ఛమైన సముద్ర జలాలు, తెల్లటి ఇసుక తీరాలు, పచ్చని కొబ్బరి చెట్లతో లక్షద్వీప్ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అగట్టి, బంగారం, కవరత్తి లాంటి ద్వీపాల్లో స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్, కయాకింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చెయ్యొచ్చు. అయితే, ఇక్కడికి వెళ్లాలంటే ముందుగానే పర్మీషన్స్ తీసుకోవాలి.
రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ సరస్సులు, రాజభవనాలు, చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి. పిచోలా సరస్సులో బోటింగ్, సిటీ ప్యాలెస్ సందర్శన, జగ్ మందిర్, సజ్జన్‌గఢ్ ప్యాలెస్ పర్యాటకులకు మంచి ఎక్స్ పీరియెన్స్ ను ఇస్తాయి. ముఖ్యంగా సాయంత్రం వేళ సరస్సు అందాలు ఆకట్టుకుంటాయి.
వన్యప్రాణులను ఇష్టపడేవారికి మధ్యప్రదేశ్ బెస్ట్ ఆప్షన్. కన్హా, బంధవ్ గఢ్, పెంచ్, పన్నా టైగర్ రిజర్వుల్లో పులులను చూసే అవకాశం ఉంటుంది. ఖజురాహో ఆలయాలు, ఓర్చా చారిత్రక కట్టడాలు, భీమ్ బెట్కా గుహలు కూడా సందర్శించే అవకాశం ఉంటుంది.
తమిళనాడులోని చెట్టినాడ్ ప్రాంతం పురాతన భవనాలు, ప్రత్యేకమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి. కారైకుడి, కనడుకథాన్ ప్రాంతాల్లోని వారసత్వ గృహాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి చెట్టినాడ్ వంటకాలను కూడా రుచి చూడవచ్చు.
మేఘాలయలోని మావ్సిన్ రామ్ ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. పచ్చని కొండలు, జలపాతాలు, మేఘాలతో కప్పుకున్న ప్రకృతి దృశ్యాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. మావ్జింబుయిన్ గుహలను కూడా సందర్శించవచ్చు.
హిమాచల్ ప్రదేశ్‌లోని ఖజ్జియార్ పచ్చని పచ్చిక బయళ్లు, దేవదారు అడవులు, మంచుతో కప్పుకున్న పర్వతాలతో అలరిస్తుంది. గుర్రపు స్వారీ, ప్రకృతి నడకలు, సరస్సు పరిసరాల్లో విహారం బాకట్టుకుంటుంది.
ముంబైలో చారిత్రక కట్టడాలు, కేఫ్‌లు, సముద్రతీర ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. బాంద్రా, కొలాబా, కాలా ఘోడా, ఫోర్ట్ ప్రాంతాలను చూస్తే, సిటీలోని విభిన్న సంస్కృతులు, లైఫ్ స్టైల్ పరిచయం అవుతాయి.
గోవా అంటే కేవలం పార్టీలు, బీచ్‌లు మాత్రమే కాదు. అస్సాగావ్, ఆల్డోనా, సాలిగావ్ లాంటి గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం, పోర్చుగీస్ స్టైల్ ఇళ్లు కనిపిస్తాయి. ఫొంటైన్హాస్ స్ట్రీట్స్, లోకల్ ఫుడ్స్ కూడా బాగా ఆకట్టుకుంటాయి.
గంగా నది తీరంలోని వారణాసి దేశంలోని పురాతన నగరాల్లో ఒకటి. తెల్లవారుజామున పడవ ప్రయాణం, దశాశ్వమేధ ఘాట్, సాయంత్రం గంగా హారతి పర్యాటకులకు మరిచిపోలేని ఎక్స్ పీరియెన్స్ అందిస్తాయి.
గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్ తెల్లటి ఉప్పు మైదానాలకు ప్రసిద్ధి. సూర్యాస్తమయం, వెన్నెల రాత్రుల్లో నక్షత్రాల కాంతి మధ్య ఈ ప్రాంతం అద్భుతంగా కనిపిస్తుంది. స్థానిక సంప్రదాయాలు, కచ్చి కళలు, హస్తకళలు ఈ ప్రయాణానికి మరింత ప్రత్యేకతను అందిస్తాయి.
Read Also: ఏపీలో 5 అద్భుతమైన రోడ్ ట్రిప్స్.. ప్రకృతి అందాలు చూస్తే మైమరచిపోతారు!