KCR – Jagan: సంక్రాంతి పండుగ రానే వస్తోంది. ఎటు చూసిన సందడి వాతావరణం ఉంటుంది. గ్రామాలకు కొత్త శోభ వస్తుంది. అక్కడక్కడా కోళ్లపందేలను సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు. ఇలా సంక్రాంతి హంగామా మనకు కనిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది ఇలా ఉంచితే ఏపీ, తెలంగాణలో పొలిటికల్ సందడి కూడా సంక్రాంతి నుండే ప్రారంభం కానుంది. రెండు చోట్ల రెండు ప్రధాన పార్టీల నాయకులు సంక్రాంతి నుండి గడపగడపకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఏపీలో ప్రతిపక్ష హోదా లేకున్నా, ఆ స్థాయి పార్టీ ఉన్నది మాత్రం వైసీపీనే. అలాగే తెలంగాణలో ప్రతిపక్ష హోదా కలిగి నిరంతరం అధికార పార్టీపై విమర్శలు సాగిస్తున్న పార్టీ బీఆర్ఎస్. ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో ఒకరినొకరు ఆత్మీయంగా మెలిగారన్న విషయం బహిర్గతమే. అయితే ఏపీలో మాత్రం వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎన్నికల ఫలితాలలో కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో, మాజీ సీఎం జగన్ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు.
తెలంగాణలో అయితే పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని గద్దెదించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ప్రజలు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ దారి పట్టారు. రెండు చోట్ల ఈ పార్టీల పరిస్థితి ప్రస్తుతం క్యాడర్ ను కాపాడుకొనే స్థితి ఉందని చెప్పవచ్చు. అందుకే కాబోలు ఏపీలో వైసీపీ అద్యక్షుడు జగన్, తెలంగాణలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇద్దరూ ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అసలే జమిలీ ఎన్నికల ప్రచారం సాగుతున్న వేళ, ఎన్నికల వరకు ఆగకుండా నిరంతరం ప్రజల్లోకి ఉండాలన్నది వీరి ప్లాన్.
Also Read: Sajjala Bhargav Reddy: సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టు షాక్, రేపో మాపో అరెస్టు!
అలా ప్రజల్లోకి వచ్చేందుకు సంక్రాంతి పండుగ రోజు వీరిద్దరూ, ముహూర్తం ఖరారు చేసుకున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే జగన్ తాను జిల్లాల పర్యటనకు వస్తానని ప్రకటించగా, కేసీఆర్ కూడా అదే తరహాలో ప్రణాళిక రూపొందిస్తున్నారట. అటు వైసీపీ, ఇటు బీఆర్ఎస్ పార్టీల అధినాయకులు జిల్లాల పర్యటనకు వస్తుండగా నాయకులు అందుకు తగ్గ రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారట. సంక్రాంతికి గ్రామాల్లో సందడి ఉంటే, వీరి పర్యటనలతో పొలిటికల్ సందడి కూడా స్టార్ట్ కాబోతోంది. ఏదిఏమైనా రాష్ట్రాలు వేరైనప్పటికీ వీరిద్దరూ మాజీ సీఎంలు కావడం, పార్టీల అధ్యక్షులు కూడా కాగా మరి వీరి పర్యటనల ఎఫెక్ట్ ఏమేరకు ఉంటుందో వేచిచూడాలి.