
Telangana congress party news(Political news in telangana):
తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఎన్నికల బరిలో బలమైన అభ్యర్థులను దింపేందుకు కసరత్తు చేస్తోంది. గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టింది. సెప్టెంబర్ మొదటి వారంలో ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తొలుత 35 నుంచి 40 మంది అభ్యర్థలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరించే ప్రక్రియ ఆగస్టు 25న ముగిసింది. మొత్తం 119 నియోజకవర్గాల నుంచి వెయ్యిమందికిపైగా నేతల నుంచి అప్లికేషన్స్ వచ్చాయి. ఈ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ చేపట్టబోతున్నారు. అభ్యర్థుల స్క్రూటినీ కోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన పీఈసీ హైదరాబాద్ లో గాంధీభవన్‌లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు సమావేశం కానుంది. ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం వచ్చిన దరఖాస్తులపై చర్చించనుంది.
ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేకంగా పీఈసీ సమావేశంలో చర్చించనున్నారు. ఎవరిని రేసులో నిలబెడితే గెలుపు ఖాయమో నిర్ణయించనున్నారు. ఈ లిస్టును పీఈసీ రూపొందించనుంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు నుంచి నలుగురిని ఎంపిక చేయనుంది. సర్వేలు, సీనియారిటీ ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని.. 35 నుంచి 40 స్థానాలకు అభ్యర్థులను ఈ కమిటీ ఎంపిక చేయనుందని తెలుస్తోంది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు సీనియర్ నేతల ఏకాభ్రియంతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీకి సిఫారసు చేస్తారు. స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తుంది. ఆ తర్వాత ఆ లిస్టును కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫారసు చేస్తారు. ఆ తర్వాత అధిష్ఠానం ఆమోదంతో తొలి జాబితా విడుదల చేస్తారు. చాలా వేగంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.