బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డిపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) పరువు నష్టం దావా వేసింది. గ్రూప్-1 ఫలితాల విషయంలో ఆయన తప్పుడు ఆరోపణలు చేయడమే దీనికి కారణం. వారంలో రోజుల్లో తమ నోటీస్ కి సమాధానం చెప్పాలని, క్షమాపణ చెప్పాలని TGPSC డిమాండ్ చేసింది. క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం, క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించింది. ఇకనైనా తప్పుడు ఆరోపణలు చేయకుండా ఉండాలని, సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ లు పెట్టొద్దని రాకేష్ రెడ్డికి సూచించింది TGPSC.
రాకేష్ ఏమన్నారంటే..?
ఇటీవల తెలంగాణలో జరిగిన గ్రూప్-1 పరీక్షల విషయంలో మెయిన్స్ పేపర్ వేల్యుయేషన్ లో తప్పులు జరిగాయని రాకేష్ రెడ్డి ఆరోపించారు. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. తెలుగు మీడియం విద్యార్థుల్లో ఎవరికీ టాప్ మార్కులు రాలేదని చెప్పారు. 45 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తే కేవలం 2 కేంద్రాల్లోని 72మందికి టాప్ ర్యాంక్ లు వచ్చాయని దీని వెనక మతలపు ఏంటని ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణ తప్పుల తడకగా జరిగిందన్నారు. ఈ ఆరోపణలపై TGPSC తీవ్రంగా స్పందించింది. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని, వెంటనే క్షమాణపు చెప్పాలని డిమాండ్ చేసింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో గ్రూప్-2 పరీక్షల వాయిదాతో ఓ విద్యార్థిని మరణిస్తే.. కేటీఆర్ తప్పుడు ప్రచారం చేశారు. ఆమె అసలు గ్రూప్-2 కి అప్లికేషనే పెట్టలేదన్నారు. తాజాగా మరోసారి TGPSC విషయంలో బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేసినట్టయింది.
ఫేక్ న్యూస్ కి కేరాఫ్ అడ్రస్..?
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం బీఆర్ఎస్ కి అలవాటేనంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇటీవల కంచ గచ్చిబౌలి భూముల విషయంలో మార్ఫింగ్ వీడియోలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మార్ఫింగ్ వీడియోలతో అందర్నీ తప్పుదోవ పట్టించింది బీఆర్ఎస్ నేతలేనంటున్నారు. విద్యార్థుల్ని రెచ్చగొట్టేందుకు వారు ప్రయత్నంచారని చెప్పారు. ఈ మార్ఫింగ్ వీడియోల విషయంలో బీఆర్ఎస్ నేతలు కేసులు కూడా ఎదుర్కోవడం విశేషం.
కాదేదీ మార్ఫింగ్ కి అనర్హం..
వణ్యప్రాణుల మార్ఫింగ్ వీడియోలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనుకున్న బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్.. ఇటీవల ఉస్మానియా యూనివర్శిటీ సర్కులర్ ని కూడా మార్ఫింగ్ చేసిన కేసులో కూడా ముద్దాయి కావడం విశేషం. ఉస్మానియా యూనివర్శిటీకి సెలవలు ఇస్తూ ఓయూ చీఫ్ వార్డెన్ ఇచ్చిన సర్కులర్ ని మార్ఫింగ్ చేసి, కారణాలను మార్చేసి ఫేక్ సర్కులర్ ని ప్రచారంలోకి తెచ్చారు మన్నె క్రిశాంక్. అప్పట్లో వార్డెన్ ఫిర్యాదు మేరకు క్రిశాంక్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.
హైడ్రానీ వదల్లేదు..
ఆమధ్య హైడ్రా దూకుడుపై ఎన్నోసార్లు బీఆర్ఎస్ నేతలు ఫేక్ న్యూస్ ప్రచారంలోకి తెచ్చినట్టు ఆరోపణలున్నాయి. ఆక్రమణలు కాకపోయినా నోటీసులిచ్చారని, కాంగ్రెస్ పెద్దల ఆక్రమణలను కూల్చి వేయలేదని ఆరోపించారు. అయితే అవన్నీ తప్పుడు ఆరోపణలు అని తేలిపోయాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నుంచి ఇలాంటి ప్రచారాలు సహజంగా మారిపోయాయి. త్వరలో ప్రభుత్వం కూలిపోతుందని, ప్రభుత్వంలో ఫలానా మంత్రికి అవమానం జరిగిందని, తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగో లేదని, కంపెనీలు తరలిపోతున్నాయని, స్థిరాస్థి రంగం నష్టాల్లోకి వెళ్లిపోయిందని.. ఇలా రకరకాల ప్రచారాలు మొదలు పెట్టారు. తాజాగా ఫేక్ వార్తలతో వ్యవస్థలపై దాడి చేస్తూ చివరకు కేసులు ఎదుర్కొంటున్నారు బీఆర్ఎస్ నేతలు.