Hyderabad City Police: సోషల్ మీడియాలో గత రెండు, మూడు రోజుల నుంచి సైబర్ నేరాల గురించి హెచ్చరిస్తూ తెలంగాణ పోలీస్ లోగో, ఒక పోలీసు అధికారి ఫోటోతో కూడిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే.. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఈ పోస్టర్‌ను పోలీసులు జారీ చేయలేదు. ఇది తప్పుడు సమాచారమని స్వయంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు స్పష్టం చేశారు. ఈ నకిలీ పోస్టర్ ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు సృష్టించినదిగా భావిస్తున్నారు.
పోస్టర్‌లో ఏముంది?
‘మీ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనల దృష్ట్యా ప్రజలందరికీ ముఖ్య గమనిక’ అనే శీర్షికతో ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు సైబర్ నేరగాళ్లు. ‘సైబర్ క్రైమ్ అవేర్నెస్ మెంబర్ రాజ్ కుమార్’ అనే పేరుతో.. తెలంగాణ పోలీస్ లోగో, ఒక అధికారి ఫోటోతో దీన్ని రూపొందించారు. ఇందులో ప్రధానంగా వాట్సాప్‌ను ఉపయోగించేటప్పుడు అనుసరించాల్సిన 13 అంశాలను తెలియజేశారు. రేపటి నుంచి కొత్త వాట్సాప్, ఫోన్ కాల్ నియమాలు అమలు కానున్నాయి అని పోస్టర్ ను సైబర్ నేరగాళ్లు వైరల్ చేశారు. ఇందులో అన్ని కాల్స్ రికార్డ్ చేయబడుతాయి.. అన్ని కాల్ రికార్డులు సేవ్ చేయబడుతాయి. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, అన్ని సోషల్ మీడియా అకౌంట్లు పర్యవేక్షించబడతాయి. ఈ సమాచారం లేని వారికి తెలియజేయండి. ఈ మొబైల్ డివైస్ మంత్రిత్వ శాఖకు కనెక్ట్ చేయబడుతోంది.
#FactCheck #FakePoster https://t.co/IiKyALzJOh
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 28, 2025
దీనిపై తెలంగాణ రాష్ట్ర పోలీసుల స్పందించారు. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇదంతా ఫేక్ అనే పెద్ద అక్షరాలతో ముద్రించి ట్విటర్ లో షేర్ చేశారు. చివరికి.. తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు (DO NOT SHARE MISINFORMATION) అని రాసుకొచ్చారు.
పోలీసుల హెచ్చరిక ఇదే..
తెలంగాణ సైబర్ క్రైమ్ అధికారులు లేదా ఇతర పోలీస్ విభాగాల అధికారులు ఈ పోస్టర్‌ను తాము జారీ చేయలేదని తెలిపారు. ఇది కేవలం నకిలీ ప్రచారం అని తేల్చి చెప్పారు. వాస్తవానికి, సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించేందుకు పోలీసులు తరచుగా అధికారిక ప్రకటనలు, ప్రెస్ నోట్లు లేదా వారి అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా మాత్రమే సందేశాలు ఇస్తుంటారు. ఈ నకిలీ పోస్టర్, అమాయక ప్రజలను భయపెట్టేందుకు లేదా తప్పుదోవ పట్టించేందుకు సృష్టించబడిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
జాగ్రత్తగా ఉండండి..
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. కానీ అందుకు అధికారిక, విశ్వసనీయమైన మూలాల నుండి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి అనధికారిక, నకిలీ పోస్టర్లను షేర్ చేయడం ద్వారా ఆ తప్పుడు సమాచారం మరింత వ్యాప్తి చెందుతుంది. ఒక పోస్టర్ లేదా మెసేజ్ అధికారికంగా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే.. ఆ విషయాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930కు ఫోన్ చేసి ధృవీకరించుకోవాలి. అనవసరమైన భయాన్ని సృష్టించే ఇలాంటి నకిలీ పోస్టర్లను ఎవరూ షేర్ చేయవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ALSO READ: Weather News: తెలంగాణపై మొంథా ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షం, ఈ ప్రాంతాల్లో పిడుగుల వాన