Maoist Party: మావోయిస్టు పార్టీకి మరోసారి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా, సిద్ధాంతకర్తగా పనిచేసిన పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. తెలంగాణ పోలీసుల సమగ్ర చర్యలు, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ప్రభావంతో మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతల లొంగుబాటు పర్వం కొనసాగుతోంది.
సుదీర్ఘ కాలం పాటు మావోయిస్టు ఉద్యమానికి కీలకమైన మార్గదర్శకుడిగా.. పార్టీ ఐడియాలజీని నిర్మించిన ప్రధాన వ్యూహకర్తగా ఉన్న చంద్రన్న లొంగుబాటు మావోయిస్టు పార్టీకి పెను విఘాతంగా అధికార వర్గాలు భావిస్తున్నాయి. అయితే, డీజీపీ ముందు లొంగిపోయిన అనంతరం చంద్రన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమది లొంగుబాటు కాదు.. అభివృద్ధిలో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చాం అని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో ఎవరి మార్గం వారు ఎంచుకున్నారు. మా మార్గం మేం ఎంచుకున్నామని చంద్రన్న పేర్కొన్నారు. జనజీవన స్రవంతిలోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి చేసిన పిలుపు మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.
ALSO READ: Viral Video: వైజాగ్‌లో భారీ కొండచిలువ.. 12 అడుగుల పామును చూసి జనం భయాందోళన!
చంద్రన్నతో పాటు లొంగిపోయిన రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్ కూడా మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరి లొంగుబాటుతో ఈ ఏడాది తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటివరకు, ఈ ఏడాదిలో 427 మంది మావోయిస్టులు రాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఈ సంఖ్య మావోయిస్టు ఉద్యమ బలహీనతను, ప్రభుత్వ విధానాల విజయాన్ని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ, తెలంగాణ నుంచి ఇంకా 64 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని అధికారులు చెబుతున్నారు.
మావోయిస్టు అగ్రనేతలు, ముఖ్యంగా సిద్ధాంతకర్త అయిన చంద్రన్న వంటి వారి నిర్ణయం.. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన కేడర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. భద్రతా బలగాల ఆపరేషన్లతో పాటు ప్రభుత్వ పునరావాస విధానాలు మరింత మంది మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి దోహదపడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: BSNL: బీఎస్ఎన్‌ఎల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. నెలకు రూ.50,500 జీతం, ఇంకెందుకు ఆలస్యం బ్రో